ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా తిరుమల వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న అన్నా.. మొదటగా శ్రీ భూవరాహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆపై శ్రీవారికి మొక్కుగా తలనీలాలు సమర్పించారు.
ఆదివారం రాత్రి గాయత్రీ నిలయంలో బస చేసిన అన్నా.. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. క్రిస్టియన్ కావడం వల్ల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఆదివారమే అన్నా డిక్లరేషన్ పై సంతకం చేశారు. సోమవారం స్వామిని దర్శించుకుని.. అర్చకుల చేతుల మీదగా తీర్థప్రసాదాలు అందకున్నారు. అనంతరం కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద తిరుమలలో పవన్ వైఫ్ అన్నా లెజినోవా అన్నదానం చేయించారు.
ఇందుకోసం భారీ విరాళాన్ని టీటీడీకి అందజేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి అయ్యే 17 లక్షల రూపాయిలను అన్నా టీటీడీ అధికారులకు ఇచ్చారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో అన్నా శ్రీవారి భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని వడ్డించారు. ఆపై భక్తులతో కలిసి అన్నప్రసాదం కూడా స్వీకరించారు. క్రిస్టియన్ అయిన కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సంప్రదాయ వస్త్రదారణలో అన్నా ఆలయంలో పూజాది కార్యకలాపాలను నిర్వహించడం పట్ల హిందువులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.