నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏపీ, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అనుమతించి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 225కు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153కు పెరుగుతుంది. “ఏపీ పునర్విభజన చట్టం” ప్రకారం ఈ పెంపు జరగాల్సి ఉంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ముఖ్యంగా ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ గంపెడాశెలు పెట్టుకున్నాయి.
ఎందుకంటే, ఆపరేషన్ ఆకర్ష్ తో పక్క పార్టీల నేతలకు గేలం వేసి కండువాలు కప్పిన జగన్, కేసీఆర్ లు…నియోజకవర్గాల సంఖ్య పెరిగితే జంప్ జిలానీలకు న్యాయం చేయవచ్చని భావించారు. అయితే, తాజాగా వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పట్లో లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఏపీ, తెలంగానలో 2031 తర్వాతే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని క్లారిటీ ఇచ్చింది.
2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడని మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో నిర్వహించే జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన తర్వాతే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తాజాగా కేంద్రం వెల్లడించడంతో ఏపీ, తెలంగాణలోని ఆశావహులు భంగపడ్డారు.