2019 ఎన్నికలకు ముందు సీనియర్ పొలిటిషన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతోపాటు వెంకటేశ్వరరావు తనయుడు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత వైసీపీ నుంచి వెంకటేశ్వరరావు బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికలలో వైసీపీ తరఫున బరిలోకి దిగిన తాను గెలవకపోవడమే మంచిదని దగ్గుబాటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు ప్రశ్నించేవారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తాను స్వేచ్ఛగా తిరిగి ప్రజల ముందుకు వెళ్ళగలిగే వాడిని కాదని అన్నారు. దేవుడి దయవల్ల పర్చూరులో ఓడిపోవడం మంచిదయిందని మనసులో మాట చెప్పారు. వైసీపీ హయాంలో కారంచేడులో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడేందుకే దేవుడు తనను ఓడించాడని చెప్పుకొచ్చారు.
తాను ఓటమి పాలైన రెండు నెలల తర్వాత జగన్ తనను పిలిపించారని, తన కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. అయితే, జగన్ పెట్టిన నిబంధనలకు తలొగ్గలేకపోయానని, అందుకే ఆ ఆఫర్ ను తిరస్కరించామని అన్నారు. వైసీపీ మనకు సరైన పార్టీ కాదని తన కుమారుడు అన్నాడని, అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశానని చెప్పారు.