సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవిపై కొద్ది రోజుల క్రితం నారాయణ సంచలన కామెంట్లు చేసి..చివరకు క్షమాపణలు చెప్పిన విషయం విదితమే. ఇక, నాగార్జున హోస్ట్ గా బూతుల స్వర్గంగా బిగ్ బాస్ హౌస్ మారిందని నారాయణ హాట్ కామెంట్లు చేశారు. ఇక, తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో గవర్నర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్న రీతిలో వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో, మహిళా గవర్నర్ అయిన తనను మూడేళ్లుగా ఇబ్బందులు పెట్టారని తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు స్పందనగా నారాయణ ఏకంగా గవర్నర్ వ్యవస్థలపైనే విమర్శలు గుప్పించారు. రాజకీయాలు చేసే ఏ గవర్నర్ అయినా పనికిమాలిన గవర్నరేనని నారాయణ సంచలన వ్యాఖ్య చేశారు.
గవర్నర్ గా తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని, తక్షణమే ఆమెను గవర్నర్ పదవి నుంచి రీకాల్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని గతంలో కూడా తాను చెప్పానని, ఇప్పుడు కూడా ఆమె లక్ష్మణ రేఖ దాటారని నారాయణ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని వ్యవస్థలను కార్పొరేట్లకు అప్పగిస్తోందని, ప్రత్యేకించి అదానీకి అప్పగిస్తోందని నారాయణ ఆరోపించారు. అదానీ, అంబానీలపై గవర్నర్ తమిళిసై ఎందుకు నోరు మెదపరని ఆయన ప్రశ్నించారు.
కాగా, తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం రాజ్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మూడేళ్లుగా మహిళా గవర్నర్ను వివక్షకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన ప్రొటోకాల్ కూడా ఫాలో కాలేదని వాపోయారు. కొన్ని విషయాలను బయటకు చెప్పుకోలేనని కూడా ఆమె వ్యాఖ్యానించారు. తనను గౌరవించకపోయినా,సన్మానించకపోయానా ప్రజాసేవలో మార్పు ఉండదన్నారు.