ఇటీవల ముగిసిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మోదీ వర్సెస్ దీదీ వార్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఘన విజయం సాధించి మరోసారి బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే టీఎంసీ మంత్రులను నారదా స్కామ్ నేపథ్యంలో అరెస్టు చేయడం ఆ తర్వాత మమతపై సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
ఎన్నికలు ముగిసిన వెంటనే నారదా స్కాం విచారణ వేగవంతం చేయడం…ఈ కేసులో ఒకప్పటి టీఎంసీ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిని అరెస్టు చేయకపోవడంపై దీదీ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మోదీకి దీదీ షాకివ్వడం సంచలనం రేపింది.‘యాస్’ తుఫానుపై మమతతో చర్చించేందుకు మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భేటీకి దీదీ డుమ్మా కొట్టడం కలకలం రేపింది.
తుపాను ప్రభావంతో అతలాకుతలమైన పశ్చిమ బెంగాల్లో ఏరియల్ రివ్యూ నిర్వహించిన మోదీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమీక్షించాలని భావించారు. అయితే, ఈ సమావేశానికి దీదీ గైర్మాజరు కావడంతో మోదీకి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మోదీకి ఎవరూ స్వాగతం పలకకపోగా…ప్రధాని నిర్వహించిన సమీక్ష సమావేశానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరూ హాజరు కాలేదు.
మమత రాకకోసం ప్రధానితోపాటు రాష్ట్ర గవర్నర్ అరగంట వేచి చూశారు. మమత నిర్లక్ష్యం, అహంభావానికి ఇది నిదర్శనమని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే, సమీక్ష సమావేశం ఉందని తమకు తెలియదని,. అయినా, మమత వెళ్లి ప్రధానిని కలిసి తుఫాను నష్టానికి సంబంధించిన వివరాలు అందించారని బెంగాల్ సర్కారు పేర్కొంది.
అయితే, వాస్తవానికి ఆ సమయంలో మమత…మోదీ సమావేశం కావాలనుకున్న భవనం ఆవరణలోనే మరో చోట ఉన్నారని బీజేపీ నేతలు అంటున్నారు. సమావేశం నిర్దేశించిన సమయానికి దాదాపు అరగంట తర్వాత మమత హుటాహుటిన వచ్చి తుఫాను నష్టానికి సంబంధించిన కొన్ని పత్రాలను ప్రధానికి అందించారని అంటున్నారు. తనను ప్రధాని కలవాలనుకున్నారని, అందుకే ఈ పత్రాలు అందించేందుకు చీఫ్ సెక్రటరీతో కలిసి వచ్చామని మమత చెప్పడం కొసమెరుపు. అయితే, ఆ ఫైల్ అందించిన ఒక్క నిమిషంలో దీదీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అయితే..స్వయంగా దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చి నిర్వహించే సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులు పాల్గొనకపోవడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని, రూల్ ఆఫ్ లాకు కూడా విరుద్ధం అని గవర్నర్ పేర్కొన్నారు. ఇది ఒకరకంగా ప్రధానిని ‘బాయ్‌కాట్’ చేయడమేనని వ్యాఖ్యానించారు.
దీనిపై, టీఎంసీ నేతల వాదన మరోలా ఉంది. తాను సమీక్ష సమావేశంలో పాల్గొనలేనని ముందే చెప్పినప్పటికీ… ప్రధానితో భేటీ కావాల్సిందేనని చెప్పినందుకే మమతకు ఆగ్రహం వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రధాని సమావేశానికి మమత ‘డుమ్మా’ కొట్టిన కొద్ది గంటల్లోనే.. బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బంధోపాధ్యాయను కేంద్రం ‘రీకాల్’ చేయడం విశేషం. ఏది ఏమైనా, యాస్ తుఫాను ప్రభావిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్‌లకు తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు అందించారు మోదీ.