ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. వివేకా వాచ్ మన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసు రూపు రేఖలు మారిపోయాయి. ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సీబీఐ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.
సునీల్ ఇచ్చిన సమాచారంతో సునీల్ సోదరుడితో పాటు పలువురు కీలక అనుమానితుల ఇళ్లలో వివేకా హత్యకు వాడిన ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్‌కు సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సుమారు రెండున్నర గంటల పాటు అభిషేక్ రెడ్డిని విచారణ జరిపిన అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
2019లో వివేకా మర్డర్ జరిగిన మరుసటి రోజు ఉదయం అభిషేక్ కూడా ఘటనాస్థలంలో ఉన్నట్లు తెలుస్తోంది. బాత్రూంలో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని హాల్లోకి ఎవరు తెచ్చారు? వివేకా తలకు కట్టు ఎవరు కట్టారు? ఆ సమయంలో అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు? అన్న ప్రశ్నలకు అభిషేక్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 2019లో జగన్ మామ డాక్టర్ గంగిరెడ్డి ఆస్పత్రిలో అభిషేక్ పని చేసేవారని తెలుస్తోంది. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి స్వయానా పెదనాన్న అయిన వైఎస్ ప్రకాశ్‌రెడ్డి పెద్దమనవడు అభిషేక్ రెడ్డి అని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు, సునీల్ యాదవ్ ఇంట్లో సుమారు 3 గంటలపాటు తనిఖీలు చేసిన సీబీఐ అధికారులు…బ్యాంకు పాస్ పుస్తకం, పాత చొక్కా స్వాధీనం చేసుకున్నారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి 5 కత్తులు, బ్యాంకు పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జగదీశ్వరరెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేసి కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం దస్తగిరి, ఎర్రగంగిరెడ్డిలను సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.