ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభాధ్యక్షుడు హోదాలో సీఎం చంద్రబాబు తొలిసారి నేడు ప్రసంగించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని రీతిలో భావోద్వేగానికి గురై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను కౌరవ సభ అంటూ వాకౌట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని..ఆనాడు తాను అన్న వ్యాఖ్యలను చంద్రబాబు సభలో రిపీట్ చేశారు. ఆ వ్యాఖ్యలను సభలో చదివి వినిపించి ఎమోషనల్ అయ్యారు.
రాజకీయాలకు సంబంధం లేని తన సతీమణి భువనేశ్వరి, తన కుటుంబ సభ్యులను దూషించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, ప్రజామోదంతో సీఎంగా సభలోకి వచ్చానని, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపై తెలుగువాడిగా పుట్టి తెలుగు జాతి ఋణం తీర్చుకుంటానని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఆనాడు తాను మాట్లాడి వాకౌట్ చేస్తానంటే మైక్ ఇవ్వలేదని, అందుకే ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని వాకౌట్ చేశానని ఆ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్ అని జగన్, వైసీపీ సభ్యులు ఎద్దేవా చేశారని గుర్తు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి 164 సీట్లు గెలుచుకుందని, ఆ అంకెలు కలిపితే వచ్చిన 11 సీట్లు వైసీపీకి రావడం దేవుడి స్క్రిప్ట్ అని తాను అనబోనని చంద్రబాబు సెటైర్లు వేశారు. 1631 రోజుల పాటు అమరావతి రైతుల ఉద్యమం అంకెలు కలిపినా 11 వస్తుందని చురకలంటించారు.
వైసీపీ నేతలు పిరికివారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని విమర్శించారు. అయితే, వైసీపీ సభ్యుల మాదిరి కూటమి సభ్యులు ప్రవర్తించకూడదని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పవన్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వనని డైలాగులు కొట్టిన వారు ఈ రోజు సభలో లేరని కొడాలి నానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో..ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసించారు.