ఒకవైపు ఆర్థిక సమస్యలు.. వెంటాడుతున్న అప్పులు.. వడ్డీలు. మరోవైపు ప్రజల ఎదురు చూపులు.. పథకా లు ఎప్పుడు అమలు చేస్తారన్న గుసగుసలు..నసనసలు! వెరసి.. 9 నెలల పాలన తర్వాత.. కూటమి సర్కారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను తాజాగా ప్రవేశ పెట్టింది. 3.22 లక్షల కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్‌ను ఉన్నంతలో ఉన్నంత బాగానే ప్రజెంట్ చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిని జోడెడ్లుగా తరచుగా చెప్పే ముఖ్యమంత్రి చంద్ర బాబు.. తాజా బడ్జెట్లో రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చారు.
ఏ విషయాన్నీ తక్కువ చేయలేదు. అందరినీ సంతృప్తి పరి చేలా బడ్జెట్‌ను తీసుకువచ్చారు. కొందరికే ఇచ్చి.. మిగిలిన వారిని వదిలేశారన్న వాదనకు తావులేకుం డా.. బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. సంక్షేమం కింద.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేశారు. ఇక, సూపర్ సిక్స్‌లో కీలకమైన మాతృవందనం పథకానికి 8276 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా తల్లులు మురిసిపో యేలా చేశారు.
అదేసమయంలో చేతి వృత్తుల వారిని పక్కన పెట్టకుండావారికి కూడా భారీగానే కేటాయింపులు చేశారు. మరీముఖ్యంగా కొన్నాళ్లుగా తెరమీదకు వచ్చిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎన్నికలకు ముందు ప్రకటించిన.. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి 6300 కోట్ల రూపాయలను కేటాయించారు. తద్వారా.. రైతులకు ఈ ఏడాది రూ.14000 చొప్పున ఇవ్వనున్నారు. కేంద్రం మరో 6000లను ఇవ్వనుంది. దీంతో రైతులకు ఇచ్చిన హామీ సాకారం అవుతుంది.
ఇక, అత్యధికంగా.. పంచాయతీరాజ్ వ్యవస్థ పుంజుకునేందుకు 18000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంతేకాదు.. ఈ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాకే జమచేయనున్నారు. దీంతో ఇప్పటి వరకు పవర్ లేని పంచాయతీలకు.. బలమైన సాధికారత లభించనుంది. విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామిక రంగాలకు కూడా.. కేటాయింపులు చేశారు. తద్వారా.. ఎవరినీ నొప్పించకుండా.. అలాగని నింగిని నిచ్చెనలు వేయకుండా.. చంద్రబాబు చేసిన మేజిక్ ఫలించిందన్న వాదన మేధావుల నుంచే వినిపిస్తుండడం గమనార్హం.