ఎన్నికలకు ముందు తీవ్ర చర్చనీయాంశం.. రచ్చనీయాంశం కూడా అయిన వలంటీర్ల వ్యవస్థ మరోసారి ఇప్పుడు చర్చకు దారికి తీసింది. వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు అధికారంలోకి వస్తే.. రద్దు చేస్తారని, ఎట్టి పరిస్థితిలో 2.30 లక్షల మంది అన్యాయం అయిపోతారని ఎన్నికలకు ముందు జగన్ పదే పదే ప్రచా రం చేశారు. అయితే..ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం.. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్ వ్యవస్థను తీసేదే లేదని.. మరింత బలోపేతం చేస్తామన్నారు.
నెలకు రూ.10 వేల చొప్పున వారికి గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెప్పా రు. అదేవిధంగా వారికి నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇచ్చి.. మరింతగా ఉన్నత స్థాయిలోకి చేరేందుకు సహకరి స్తామని కూడా చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సైతం.. ఇదే మాట చెప్పారు. కట్ చేస్తే.. సర్కారు ఏర్పడి 50 రోజులు గడిచిపోయినా..ఇప్పటి వరకు వలంటీర్ల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇదే సమయంలో కొన్ని అనుబంధ సంఘాలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాయి.
వలంటీర్ల సేవలు అవసరం లేదని.. సచివాలయాల్లో ఉన్న సిబ్బందిచాలని వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ.. సర్కారుకు వినతి పత్రాలు రావడమే కాదు.. హైకోర్టులోనూ కేసులు నమోదువుతు న్నాయి. వలంటీర్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. వలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదే విషయంపై ప్రస్తుతం జనాల్లోనూ తర్జన భర్జన కొనసాగుతోంది. వలంటీర్లను ఐదు వేల మందికే పరిమితం చేయాలని చూస్తున్నట్టు మరో వాదన వినిపిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అలజడి రేగుతున్నా.. ఎక్కడా కూడా.. రాజకీయంగా వారిపై స్పందించేందుకు చంద్రబాబు ప్రయత్నించడం లేదు. పైగా.. ఎవరూ మాట్లాడడం లేదు. ఈ పరిణామం వెనుక రీజన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వలంటీర్లను కొనసాగిస్తే.. ప్రభుత్వ విషయాలు మెల్లగా తెలుసుకుని.. ప్రజలకు చేరవేసే ప్రమాదం ఉందని.. ప్రజలకు-వలంటీర్లకు మధ్య బలమైన బంధం ఏర్పడితే మంచిది కాదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బంధమే వైసీపీ కొంపముంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కుంపటిని తన నెత్తిన పెట్టుకునేందుకు బాబు విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.