ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభ తొలి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రెండో రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేయని ముగ్గురితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఏపీ స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఏపీ సీఎం, లీడర్ ఆఫ్ ది హౌస్ చంద్రబాాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మిగతా సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో చంద్రబాబు తొలిసారి ప్రసంగించారు.
అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. విశాఖ కోసం అయ్యన్న ఎంతో చేశారని, ఏపీ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అయ్యన్నపై 23 కేసులు పెట్టినా బెదరలేదని, అందులో ఒక రేప్ కేసు కూడా పెట్టి వైసీపీ నేతలు పైశాచికానందం పొందినా పోరాడారని అన్నారను. ఏ పదవి ఇస్తే ఆ పదవికి వన్నె తెచ్చే వ్యక్తి అయ్యన్న అని చెప్పారు.
గత సభను వైసీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు వేదికగా మార్చారని, నీచరాజకీయాలకు ఐదేళ్ల వైసీపీ పాలన వేదికగా మారిందని అన్నారు. కానీ, ఈ సభలో మనం హుందాగా ప్రవర్తించాలని సభ్యులకు హితవు పలికారు. సభలో బూతులు తిట్టడం, సభలో బాధపడిన ఘటనలు అనేకం ఉన్నాయిని, గతంలో తాను మాట్లాడతానంటే మైక్ ఇవ్వలేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 9 సార్లు సభలో ఉన్నానని, కానీ,15వ శాసన సభను కౌరవ సభగా భావించి మరచిపోదాం అని, ఈ 16వ సభను గౌరవ ప్రదంగా నిర్వహించి….మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంగా ఉండాలని కూటమి సభ్యులందరినీ కోరుకుంటున్నానని అన్నారు.