సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వ్యవహారంపై ఈరోజు విచారణ జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్ వి ఎన్ భట్టిల ధర్మాసనం ముందుకు చంద్రబాబు పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, ఏపీకి చెందిన జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మీ అని ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నారు.
దీంతో, చంద్రబాబు పిటిషన్ మరో బెంచ్ కి బదిలీ చేసిన సుప్రీం అక్టోబర్ మూడో తేదీకి విచారణను వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్, ప్రమోద్ కుమార్ వాదనలు వినిపించారు. ఇక, ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ వాదించారు. అయితే, ఈ పిటిషన్ విచారణను చేపట్టాలని సీజేఐ చంద్రచూడ్ కు సిద్దార్థ్ లూథ్రా విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పిటిషన్ త్వరగా లిఫ్ట్ చేయాలని, మధ్యంతర ఉపశమనం కల్పించాలని సీజేఐని లూథ్రా రిక్వెస్ట్ చేశారు. 17 ఏ సెక్షన్ ఎఫ్ఐఆర్ ప్రకారం చంద్రబాబును కస్టడీలో పెట్టకూడదని అన్నారు.
తాము బెయిల్ కోరడం లేదని, కస్టడీ వద్దని మాత్రమే చెబుతున్నామని అన్నారు. జడ్ క్యాటగిరి సెక్యూరిటీ, ఎన్ఎఎస్ జీ భద్రత ఉన్న వ్యక్తికి ఇటువంటి ట్రీట్మెంట్ చేయడంపై తమ అభ్యంతరం అని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పారు. లూథ్రా చెప్పింది విన్న తర్వాత అక్టోబర్ 3న చంద్రబాబు పిటిషన్ ఏ బెంచ్ కు తరలిస్తామో వెల్లడిస్తామని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. అంతుకుమందు, వారం రోజులకు ఈ పిటిషన్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఇక, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో బెయిల్, కస్టడీ పిటిషన్ ల పై వాదనలు కొనసాగుతున్నాయి.