బొప్పూడి ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. మోడీ అంటే ఆత్మగౌరవం అని, ఆత్మవిశ్వాసమని, ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు మోడీ అని చంద్రబాబు కొనియాడారు. భారత్ ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు నిర్విరామ కృషి చేస్తున్న గొప్ప నాయకుడు అని కొనియాడారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ అని… మోడీ అంటేనే నమ్మకం అని చంద్రబాబు కితాబిచ్చారు.
100 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోడీదే అని కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలను కాపాడింది ఆయనే అని గుర్తు చేశారు. మోడీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలని సరైన సమయంలో దేశానికి మోడీ వంటి నేత వచ్చారని చెప్పారు. ఇక దేశమంతా మోడీ పాలనలో దూసుకుపోతుందని, కానీ జగన్ పాలనలో రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయిందని చంద్రబాబు విమర్శించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరం పని చేయాలని పిలుపునిచ్చారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ పేరుతో రాష్ట్రాన్ని దుర్మార్గుడు జగన్ దోచుకున్నాడని విమర్శించారు.
జగన్ అధికార దాహానికి బాబాయ్ వివేకా బలయ్యాడని, జగన్ ఎటువంటి వాడో ఆయన చెల్లెళ్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాటాడిన జగన్ అమరావతి రాజధానిని భ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేస్తే దానిని జగన్ గోదావరిలో కలిపేసాడు అని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా తరిమేశాడని మండిపడ్డారు. ఇక విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషిత చేశాడని ఆరోపించారు. జగన్ పాలనకు ముగింపు పలికి ఎన్డీఏను గెలిపించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు వాయిస్ చాలా గట్టిగా ఉందని ప్రధాని మోడీ ఆయనతో నవ్వుతూ చెప్పినా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.