వైసిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఇలాకా పుంగనూరులో పారిశ్రామికవేత్త, జనసేన నేత రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. పార్టీలకతీతంగా రైతుభేరి నిర్వహించేందుకు ప్రయత్నించిన రామచంద్ర యాదవ్ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగడం వివాదానికి దారితీసింది. పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్న వైనం, రామచంద్ర ఇంటిపై దాడి ఘటనలపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి జరిగిన దాడి వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన చంద్రబాబు…. జగన్ పై నిప్పులు చెరిగారు. గతంలో బీహార్ లో ఇటువంటి పరిస్థితులు ఉండేవని, కానీ ఈరోజు పుంగనూరులో ఈ తరహా దాడులు జరగడం దారుణం అని చంద్రబాబు మండిపడ్డారు. అంతేకాదు, నాలుగు జతల ఖాకీ యూనిఫాంలను పుంగనూరు పోలీసులకు పంపించండి అంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు సెటైర్లు వేశారు. అలా చేయకుంటే రాష్ట్రంలో మొత్తం పోలీస్ శాఖ మూసివేశారని ప్రజలు అనుకుంటారని చంద్రబాబు సెటైర్లు వేశారు.
కాగా, వెనుకబడిన కులానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి వైసిపి ఆలోచనా విధానానికి నిదర్శనం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో రైతుల సదస్సు నిర్వహించడమే రామచంద్ర యాదవ్ చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు. రైతుల సభకు అనుమతి లేదన్న పోలీసులు…రామచంద్ర యాదవ్ ఇంటిపై వైసీపీ కిరాయి మూకలు దాడి చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారని, ఆ దాడిని ఎందుకు ఆపలేకపోయారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు…నేటి రోజుల్లో పుంగనూరు! డీజీపీ గారూ… నాలుగు జతల ఖాకీ దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపండి. లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీసు శాఖను మూసేశారు అనుకుంటారు.@APPOLICE100
#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/VlyeXQeCA3— N Chandrababu Naidu (@ncbn) December 5, 2022