సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ పోస్టును షేర్ చేశారన్న ఆరోపణలపై అంకబాబుకు 41-ఏ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీంతో, పోలీసుల రిమాండ్ రిపోర్టును గుంటూరు కోర్టు తిరస్కరించింది. ఆ వ్యవహారంపై పోలీసుల సంజాయిషీ కోరిన కోర్టు…అంకబాబుకు నోటీసులిచ్చి విడుదల చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అంకబాబు అరెస్ట్ అక్రమం అని కోర్టు తేల్చిందని, దీనిపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంకబాబుకు 41-ఏ సీఆర్పీసీ నోటీసులచ్చే విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ కోర్టు చెప్పిందని అన్నారు. ఆ అరెస్టుపై 4 రోజుల్లో వివరణ కోరుతూ సీఐడీ పోలీసులకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు.
ఇలా, ప్రభుత్వం ఒత్తిడితో అక్రమ అరెస్ట్ లకు పాల్పడిన పోలీసులు…కోర్టులకు సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి వచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితికి ఏపీ పోలీసు శాఖను తీసుకువచ్చింది ఎవరు? అని నిలదీశారు. తమ తప్పుడు వైఖరికి సీఐడీ సిగ్గుపడాలని, రాష్ట్రంలో చట్టాల ఉల్లంఘనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించిందని అన్నారు. అక్రమ అరెస్టులపై పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం పోలీసులు చేసే చట్ట ఉల్లంఘనలు వారిని సైతం బోనులో నిలబెడతాయని, ఆ చర్యలకు పోలీసులు మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలను, రాజకీయ పక్షాలను, జర్నలిస్టులను భయపెట్టేందుకు అధికారదుర్వినియోగం జరుగుతోందని, రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందనడానికి ఇవే రుజువులని విమర్శించారు. జగన్ దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.