అదేంటో కానీ.. ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన అనగానే.. పోలీసులకు ఏపీలో చట్టాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు ఆపార్టీ నాయకులు. తాజాగా చంద్రబాబు ఏపీలో పర్యటనల కు శ్రీకారం చుట్టారు. పార్టీని సమాయత్త పరిచి.. వచ్చే ఎన్నికలకు నేతలను సన్నద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన.. జోనల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే.. అనూహ్యంగా చంద్రబాబు పర్యటన అనగానే.. పోలీసులు వెంటనే చట్టాలను ప్రయోగిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తాజాగా ఈ నెల 10 నుంచి కృష్ణాజిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. నెల ఆఖరు వరకు ఇది అమల్లో ఉంటుందని.. నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. బహిరంగ సభలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని.. అనుమతి తీసుకున్నా కే నిర్వహించాలని తేల్చి చెప్పారు. దీంతో టీడీపీ నేతలు పోలీసుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, చంద్రబాబు ఈ నెల 12 నుంచి కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు.
చంద్రబాబు ఈ నెల 12వ తేదీన మచిలీపట్నంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం అక్కడ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించి అక్కడే బస చేయనున్నారు. 13వ తేదీన గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రాత్రికి గుడివాడలోనే బస చేయనున్న ఆయన, 14వ తేదీ ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు యాక్ట్ 30ని ప్రకటించడం పట్ల.. టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
+ చంద్రబాబు ఈనెల 12వ తేదీన మచిలీపట్నంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు చేరుకోనున్నారు. అక్కడ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించి అక్కడే బస చేయనున్నారు.
+ 13వ తేదీన గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రాత్రికి గుడివాడలోనే బస చేయనున్నారు.
+ 14వ తేదీ ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 14వ తేదీ మధ్యాహ్నం నూజివీడులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు.