ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన `పుష్ప 2` మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 80 దేశాల్లో మొత్తం ఆరు భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఆడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇదే తరుణంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. ఇటీవల హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బన్నీ తన స్పీచ్ తో అదరగొట్టారు. అయితే ఎక్కడా మెగాస్టార్ ప్రస్తావన కానీ మెగా ఫ్యామిలీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు.
ఇదే మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. స్టార్డమ్ వచ్చాక బన్నీ తన రూట్స్ ను మరచిపోయాడంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించావ్.. రాష్ట్రం కోసం పవన్ అహర్నిశలు పని చేస్తున్నారు.. ఆయన్ను నువ్వు గుర్తించలేదంటూ చలమలశెట్టి బన్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా ఫ్యామిలీ అండంతో ఇండస్ట్రీలోకి వచ్చావ్.. ఆ ఇంట్లోనే పెరిగానని, మెగాస్టార్ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పావ్.. కానీ ఇప్పుడు వారి ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం సరికాదన్నారు. బన్నీ తీరు మెగా అభిమానులకు, జనసైనికులకు ఎంతో బాధ కలిగిస్తుందని చలమలశెట్టి అన్నారు. ఇప్పటికైనా బన్నీ తన తీరు మార్చుకుని చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే పుష్ప 2 సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.