ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాలేదనే నెపంతో కోర్టులను, న్యాయమూర్తులను దూషించిన వైసీపీలోని కొందరు నేతలపై సీబీఐ విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇప్పుడు కోర్టుకు చేరింది.
ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు దాదాపు 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి .. వైసీపీ జెండాలోని రంగులను వేయడంపై కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే. దీనిని విచారించిన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం.. తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే వాటి రంగులు మార్చాలని ఆదేశించింది.
అయితే.. అప్పటి సీఎం నీలం సాహ్ని..ఈ విషయంలో కొంత అత్యుత్సాహం చూపి.. ఒక రంగును మార్చి.. అంతా మార్చామనే బిల్డప్ ఇచ్చారు.. దీనిపై మరోసారి కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో నేరుగా సీఎస్‌నే హైకోర్టుకు పిలిచి మరీ న్యాయమూర్తులు తలంటారు.
ఇక, ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. చేసిన తప్పును సరిదిద్దుకోవాల్సిన సర్కారు పెద్దలుపార్టీలోని కొందరిని ప్రేరేపించి.. కోర్టులు, న్యాయమూర్తులపై విపరీత వ్యాఖ్యలు చేసేలా చేశారు..
ఈ క్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సహా పలువురు.. నాయకులు కకోర్టులను, న్యాయమూర్తులను దూషించారు.. ఇక, వీరిపై కేసులు నమోదయ్యాయి.
కోర్టు జోక్యం చేసుకుని వీటిపై విచారణను స్థానిక పోలీసులకు అప్పగించినా.. వారు సరిగా విచారించలేదు.. దీంతో మరోసారి ఈ కేసులను సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలో పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆర్టికల్ 19 కకింద సమర్ధించుకుని.. వీరికి తాము అండగా ఉంటామన్నారు.
దీనిపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సాగిన సీబీఐ విచారణలో మధ్యంతర నివేదిక.. తాజాగా హైకోర్టుకు చేరింది. అయితే.. పూర్తిస్థాయి నివేదిక అందించేందుకు మరో మూడు మాసాల సమయంలో కోరడంతో కోర్టు ఈ కేసు విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. మొత్తానికి తాజాగా ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏముందనేది ఆసక్తిగా మారింది.