ఏపీలో 135 నామినేటెడ్ పోస్టులను సీఎం జగన్ భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ ప్రక్రియలో కొన్ని వర్గాల వారికే జగన్ న్యాయం చేశారని విమర్శలు వస్తున్నాయి. తన సొంత సామాజిక వర్గ నేతలతో పాటు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, పరిస్థితులను బట్టి పదవుల పంపకం చేపట్టారని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమకు చెందిన వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చైర్మన్ పదవి(శాప్)ని జగన్ కట్టబెట్టారని అంటున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో నందికొట్కూరులో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించడంతోనే ఆయనకు ఈ పదవి దక్కిందని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక బైరెడ్డికి ప్రాధాన్యత గల పదవి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్…తాజాగా దానిని నిలబెట్టుకున్నారని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాప్ చైర్మన్ పదవిని భర్తీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సిద్దార్థ్‌రెడ్డి నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే, ఎమ్మెల్యే ఆర్థర్‌కు, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆర్థర్ పేరుకే ఎమ్మెల్యే అని, నియోజకవర్గంలో పెత్తనం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిదే అని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లోనూ తన అనుచరులకు టికెట్లు ఇవ్వట్లేదని బైరెడ్డి, ఆర్థర్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వీధి పోరాటాలు చేసుకున్న వివాదాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే బైరెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు జగన్ కీలక పదవి ఇచ్చారని అనుకుంటున్నారు.