ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి ఈ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. అయితే, ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నారని విపక్ష నేతలు ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, అసలు నిందితులను వదిలేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో అవినాష్ రెడ్డిపై గతంలో వివేకా కూతురు సునీతా రెడ్డి కూడా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అవినాష్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలు నార్కో అనాలసిస్ టెస్ట్‌కు అంగీకరించాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఒకవేళ, నార్కో అనాలసిస్‌కు వారు అంగీకరించకుంటే.. హత్యతో సంబంధం ఉందని అనుమానించక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా కుటుంబానికి జరుగుతున్న ద్రోహంపై పులివెందుల ప్రజలు నివ్వెరబోతున్నారని, వివేకా హత్య అందరినీ షాక్ కు గురి చేసిందని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో జగన్, అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నిందితుడు శంకర్‌రెడ్డి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారంటే వివేకా హత్యలో జగన్ పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వస్తున్నాయని బీటెక్ షాకింగ్ ఆరోపణలు చేశారు.