మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు అట్టహాసంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య సాధనలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అందరికీ తెలియాలని, అందుకే ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకుంటున్నామని మోదీ తెలిపారు. దేశం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఈ వేడుకల ద్వారా స్మరించుకోవాలని అన్నారు.
తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోదీ ఆంధ్రప్రదేశ్ పై ప్రశంసలు కురిపించారు. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్య భూమి, ఒక వీర భూమి అని, ఇలాంటి పుణ్య భూమికి రావడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అని పొగడ్తలతో ముంచెత్తారు. పింగళి వెంకయ్య, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి త్యాగధనులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు.
అల్లూరి రంప పోరాటానికి వందేళ్లు పూర్తయ్యాయని, ఆ మహనీయుడు నడయాడిన నేలపై మనం నడవడం సంతోషకరమని అన్నారు. వందేమాతరం నినాదం, ‘మనదే రాజ్యం’ నినాదం ఒకే లాంటివని చెప్పారు. మోగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్ ను అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియంను నిర్మిస్తామని అన్నారు. ఏడాది పాటు అల్లూరి జయంతి, రంప పోరాటం ఉత్సవాలను నిర్వహిస్తామని మోదీ తెలిపారు అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులను మోదీ సన్మానించారు.
కాగా, అంతకుముందు మోదీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భీమవరానికి మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్ల బెలూన్లను ఢీకొట్టే ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. హెలికాప్టర్ వస్తున్న సమయానికి కొందరు వ్యక్తులు గాల్లోకి నల్ల బెలూన్లను ఎగురవేయగా…అవి హెలికాప్టర్ కు సమీపంగా వెళ్లాయి. దీంతో, ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కోరింది. ఇది భద్రతా వైఫల్యమేనని ఎస్పీజీ, బెలూన్ల తరహాలో డ్రోన్లను ఎగురవేసి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
అయితే, ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని, హెలికాప్టర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో బెలూన్లను ఎగురవేశారని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా అన్నారు. బెలూన్లలో హైడ్రోజన్ లేదని… నోటితో గాలి ఊది బెలూన్లను ఎగరేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపారని వెల్లడించారు. సుంకర పద్మశ్రీ, సావిత్రి, రాజీవ్ రతన్ వంటి వారు ఈ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు.