రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు తమకు ఎలాంటి బాధా లేదని అంటూనే.. మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు .. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ-జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందన్నారు. అంతేకాకుండా.. ఇలా కనుక జరిగితే.. సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. సరే! ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ.. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి.
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేక పోతోంది. పైకి మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ.. లోలోన మధన పడుతోంది.
ఈ క్రమంలో తాజాగా సోము వ్యాఖ్యలపై స్పందించిన బొత్స సత్యనారాయణ లేదు లేదంటూనే భుజాలు తడుముకున్నారు. 20 నెలల ముఖ్యమంత్రి జగన్ పాలనకు ప్రజలు స్థానిక సమరంలోనూ పట్టం కట్టారని తెలిపారు. ఇందుకు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.
ఇదే ఉత్సాహంతో తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం అభ్యర్థికి, ఉప ఎన్నికకు ఉన్న సంబంధం ఏమిటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటువంటి వాటిపై తాము స్పందించనవసరం లేదని అంటూనే.. పాదయాత్రలు, తలకిందులు యాత్రలు చేసినా తమకు నష్టం ఏం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. బీజేపీ ఎవరిని తెచ్చుకు న్నాసీఎం జగన్కు ప్రజా బలం ఉందని మంత్రి బొత్స పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ విషయంపై బీజేపీ ఏం చెబుతుందని, విభజన చట్టంలోని అంశాలు, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన మాట నెరవేర్చామా లేదా అనేది వారికి వారు ఆలోచించుకోవాలని హితవు పలికారు.
సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కాబట్టే తిరుగులేని విజయాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. మోసాలు, మాయలను ఎవరూ నమ్మరని విమర్శించారు. అయితే.. ఇంత ధైర్యం ఉన్నప్పుడు.. బీజేపీ నేత సోము చేసిన వ్యాఖ్యలపై ఇంత సుదీర్ఘ వివరణ ఎందుకు ఇచ్చారనేదే అంతుచిక్కని విషయం.
అంటే.. దీనిని బట్టి.. వైసీపీ నేతలు… పవన్ విషయంలో తర్జన భర్జన పడుతున్నారనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఏమీ లేదు… తమకు ఏమీ కాదనని ధీమా ఉన్నప్పుడు ఈ భుజాలు తడుముకోవడం ఎందుకో కూడా బొత్స సమాధానం చెప్పి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.