టన్నుల కొద్దీ ఎనర్జీ.. అంతకు మించిన కలుపుకోలుతనం.. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అది మాట్లాడటం..
కామ్ గా ఉన్న వారిని కెలికి తనకుఅవసరమైన కంటెంట్ ను జనరేట్ చేసుకోవటం..
దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే.. అతడు కాస్త వేరుగా ఉంటాడు.. అతను మన స్కూల్ కాదు.. మనకెందుకులే అనటం..
టాస్కుల్లో విజయం సాధించేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూనే.. ఫలితం ఏ మాత్రం తనకుఅనుకూలంగా రాకున్నా.. తీవ్ర ఆగ్రహానికి గురి కావటం..
వీటన్నింటికి మించి తన అమాయకత్వాన్ని ప్రదర్శించటం..
నోట్లో వేలు పెడితే కొరకలేనట్లుగా కొన్ని విషయాల్లో వ్యవహరిస్తూనే.. తేడా వచ్చినప్పుడు.. బయట చూసుకుందామన్నట్లుగా ఆగ్రహాన్ని వ్యవహరించటం..
జగమొండి మాటల్ని మాట్లాడటం.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం లాంటివి బిగ్ బాస్ సన్నీలో కనిపిస్తాయి.
మొదట్నించి జట్టు కట్టి.. ఆ జట్టును తనకు అనుకూలంగా మార్చుకుంటూ.. వారికి అవసరమైన సాయాలు చేస్తూ.. ఆ జట్టుకు తాను అప్రకటిత కెప్టెన్సీ పాత్రను పోషించే సన్నీ.. మిగిలిన వారితో మచ్చా.. మచ్చా అంటూ అప్యాయతను ప్రదర్శిస్తూ ఉంటారు. అది కూడా తనకు తేడా జరగనంత వరకే.
స్నేహం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే సన్నీలో పాజిటివ్ విషయాల్ని కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిందే. కనెక్టు కావటం కష్టం కానీ.. ఒకసారి కనెక్టు అయ్యాక.. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా.. తనకు కనెక్టు అయిన వారి కోసం ఎంత త్యాగానికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తాడు. జట్టు నాయకుడిగా ఉదాత్తంగా వ్యవహరించే గుణం సన్నీలో కనిపిస్తుంది.
తన జట్టులోని వారు సరిగా వ్యవహరించకున్నా.. తప్పులు చేసినా.. వారిని వెనకేసుకురావటం.. వారికి దన్నుగా ఉండటం లాంటివి చేసేందుకు వెనుకాడని లక్షణం సన్నీలో ఎక్కువ. అదే సమయంలో తనవారిని సేవ్ చేయటం కోసం ఎంతలా తపిస్తాడో..తనకు వైరి వర్గంగా ఫీలయ్యే వారిని వెంటాడి మరీ వేటాడటం కనిపిస్తుంది.
ఇలాంటి విశ్లేషణలు సన్నీని అభిమానించే వారికి నచ్చవన్నది తెలిసిందే. సన్నీకి ఎవరైనా నచ్చకుంటే.. వెంటనే వారికి లేబులింగ్ చేయటం ప్రసిద్ధి. ఇదే తీరును ఆయన్ను అభిమానించే వారు కూడా సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. సన్నీకి వ్యతిరేకంగా ఉన్న వారు.. మరెవరికో సానుకూలమన్నట్లుగా ముద్రలు వేయటం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
నిజానికి ఇదే సన్నీతో వచ్చిన సమస్య. విషయాన్ని సూటిగా చెప్పేస్తానంటూనే.. తనకు అనుకూల వాదనను వినిపించుకునే గుణం అతడిలో ఎక్కువ. కాకపోతే.. వాత పెట్టి వెన్న రాయటంలో సన్నీ తర్వాతే ఎవరైనా.
యాంకర్ రవి ఎలిమినేషన్ సందర్భంగా అతనికిచ్చిన ముద్దులు ఒక ఎత్తు అయితే.. బ్యాగేజ్ సర్దుకునే సమయంలో అతనికి గతంలో వచ్చిన గిఫ్టును రవికి ఇచ్చేసి.. ఎవరికైనా ఇవ్వమని చెప్పటం దేనికి సంకేతం? ఇదంతా ఒక ఎత్తు అయితే.. సోమవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ ను చూసినప్పుడు.. రవి ఎలిమినేషన్ మీద చేసిన వ్యాఖ్యలు అండర్ లైన్ చేసుకోవాల్సిందే.
సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ సందర్భంగా శ్రీరామ చంద్రను ఎలిమినేషన్ చేయాల్సిన అవసరం లేకున్నా.. అతడ్ని టార్గెట్ చేసిన తీరు చాలామందికి నచ్చలేదు. ఎలిమినేషన్ కునామినేట్ చేసి.. ఏం చేయమంటావ్.. నువ్వు తప్పించి వేరే వారు లేరన్న సన్నీ.. స్నేహ ధర్మాన్ని ప్రదర్శించినట్లు కనిపిస్తుంది.
అలాంటప్పుడు తప్పు చేసే బరాబర్ లాంటి మాటను మాట్లాడకూడదు. ఎలిమినేషన్ కు నామినేట్ చేసి .. హగ్గులు.. ముద్దులు ఇచ్చేయటం దేనికి నిదర్శనం? మొన్న రవి.. నిన్న శ్రీరామచంద్ర.. ఇలా ఒకరి తర్వాత పోటు పొడిచి.. హగ్ చేసుకోవటం సన్నీకి మాత్రమే సాధ్యమయ్యే పనిగా చెప్పాలి.