“వరద బాధితులను ఆదుకునేది ఇలానేనా? మా హయాంలోనూ అనేక వరదలు చూశాం. బాధితులను ఉదారంగా ఆదుకున్నాం. ప్రతి కుటుంబానికీ రెండేసి కిలోల చొప్పున కూరగాయలు పంపించాం. 25 కిలోల బియ్యం ఇచ్చాం. పునరావాస కేంద్రాల్లోని వారికితాగునీరు.. భోజనం అందించాం. వెళ్తున్న వారికి రూ.2000 చొప్పున నగదు పంచాం. కానీ, ఇప్పుడు కనీసం వారికి ఆకలి మంటలు కూడా తీర్చడం లేదు“ అని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ .. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
అయితే.. ఇప్పుడు ఆయన హయాంలో ఏం జరిగిందనే విషయం వెలుగు చూసింది. అప్పట్లో ఏలూరు, విజయవాడ కృష్ణలంక, కర్నూలు జిల్లాల్లో వచ్చిన వరదల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన మాట వాస్తవమే. కానీ, జగన్ చెబుతున్నట్టు వారికి కిలోల లెక్కల సరుకులు అయితే పంపిణీ చేయలేదు. అప్పట్లో బాధితులు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“నాలుగు బంగాళ దుంపలు, నాలుగు టమాటాలు, నాలుగు ఉల్లిగడ్డలు ఇచ్చారు. 50 గ్రాముల కందిపప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు. ఇంతకుమించి మాకు ఏమీ ఇవ్వలేదు“ అని అప్పట్లో బాధితులు చెప్పారు. అంతేకాదు.. “తిని అబద్ధం ఆడుతామా? ఇస్తే.. ఇచ్చారనే చెబుతాం కదా!“ అని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన సాయాన్ని వారు మీడియా ముందు ప్రదర్శించారు. ఇది స్థానిక మీడియా కూడా కాదు.. బీబీసీ కావడం గమనార్హం. అదే స్తానిక మీడియా అయితే.. రాజకీయాలు అంటగట్టేవారని ఇప్పుడు రాజకీయ నేతలు చెబుతున్నారు.
ఇప్పుడు ఏం చేస్తున్నారు.
ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు.. చంద్రబాబు సర్కారు ఉదారంగానే సాయం చేస్తోంది. ఇంట్లో ఒకరున్నా..ఇద్దరున్నా.. సాయాన్ని అందించేలా ప్రతి ఒక్క కుటుంబానికీ చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బియ్యం – 25 కిలోలు
బంగాళ దుంపలు – 2 కిలోలు
ఉల్లిపాయలు – 2 కిలోలు
పామాయిల్ – 1 ప్యాకెట్
చక్కెర – 1 కేజీ
కందిపప్పు – 1 కేజీ