అది ఇది అన్న తేడా లేకుండా ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా దోచేస్తున్న సైబర్ దొంగల ఎత్తుగడలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా చోటు చేసుకున్న సైబర్ నేరం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. సైబర్ నేరానికి ప్రధాన కారణం అత్యాశ. ఉచితంగా ఏదైనా వస్తుందన్నా.. ఉత్తి పుణ్యానికే కోట్లు వచ్చే అవకాశం ఉందన్నంతనే ఆశ మొదలవుతుంది. అలాంటి మాటలకు అస్సలు పడకూడదు. ఏ మాత్రం అట్రాక్టు అయినా మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. కర్ణాటకలో చోటు చేసుకున్న సైబర్ నేరం గురించి తెలిస్తే నోటి వెంట మాట రాదంతే.
బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ఉద్యోగికి ఇటీవల సైబర్ నేరస్తులుఫోన్ చేసి.. మీరు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశారని.. అలాంటి వారందరిని కలిపి లాటరీ తీయగా.. మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అనంతరం కొరియర్ ద్వారా ఫోన్ ను ఇంటికి పంపారు. ఉచితంగా ఫోన్ వచ్చిందన్న ఆశతో.. తన పాత ఫోన్లోని సిమ్ తీసి.. కొత్త సిమ్ కార్డు వేశాడు. సిమ్ వేసిన గంట తర్వాత ఆ ఫోన్ కు పలు సందేశాలు.. ఓటీపీలు వచ్చాయి. ఫోన్ కొత్తది కావటంతో ఆ మెసేజ్ లను సదరు ఐటీ ఉద్యోగి పట్టించుకోలేదు.
అయితే.. బహుమతిగా పంపిన ఫోన్ తమ అధీనంలోకి తీసుకున్న స్కామర్లు తమకు నచ్చిన ఓటీపీలు పెట్టుకొని బాధితుడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.8 కోట్ల మొత్తాన్ని కాజేశారు. కాస్త ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన ఐటీ ఉద్యోగి.. లబోదిబో అనుకుంటూ వైట్ ఫీల్డ్ లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉచితంగా వచ్చే వాటి మీద ఏ మాత్రం ఆశను ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. బీకేర్ ఫుల్.