నటసింహం.. టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికి రెండు సార్లుగా ఉమ్మడి అనంతపురం జిల్లా హిం దూపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం.. గెలుపు గుర్రం ఎక్కడం తెలిసిందే. రెండు ఎన్నికల్లోనూ ఎక్కడా పెద్దగా బాలయ్య కష్టపడిందిలేదు. ఆయనకు సంస్థాగతంగా ఉన్న ఇమేజ్, తండ్రి తాలూకు వారసత్వం.. క్షేత్రస్థాయలో అభిమానుల ఫాలోయింగ్ వంటివి కలిసి వచ్చాయి.
2014 ఎన్నికల్లో తొలిసారి హిందూపురం నుంచి బరిలోదిగిన బాలయ్యకు 16 వేల పైచిలుకు మెజారిటీ లభిం చింది. ఇక, 2019 ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. 17 వేల మెజారిటీ దక్కించుకున్నారు. ఇక, ఇప్పు డు మాత్రం.. ఈ రెండు ఎన్నికలకు మించి.. బాలయ్యకు 50 వేల మెజారిటీ దక్కుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దీనికి ప్రధానంగా నాలుగు రీజన్లు కూడా చెబుతున్నారు. ఇవే బాలయ్య మెజారిటీని తారస్థాయికి చేరుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు.
ఇవీ.. రీజన్లు…
1) ప్రస్తుతం పుట్టపర్తి కేంద్రంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లాకు టీడీపీ అధికారంలోకి వస్తే.. స్థానికుల అభిప్రాయం, ఆకాంక్షల మేరకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామన్న హామీ.
2) నందమూరి నిత్యాన్న పోషణ పథకం కింద రోజూ రూ.2కే కడుపు నిండా పేదలకు, వృత్తిదారులకు, రైతు కూలీలకు భోజనం అందించడం.
3) బసవతారకం మొబైల్ వైద్యం పేరుతో ఊరూరా.. వాడవాడా.. వైద్యాన్ని చేరువ చేయడం.. ఉచితంగా మందులు అందించడం.
4) పేదలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి.. బాలయ్య సతీమణి నేరుగా స్పందిస్తుండడం.
ఈ నాలుగు రీజన్లు బాలయ్య ఇమేజ్ను మరింత పెంచాయని.. ఇక్కడ ఆయనకు తిరుగులేదని.. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో 50 వేల పైచిలుకు ఓట్లతో విజయం దక్కించుకుంటారని తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం.