నటసింహం నందమూరి బాలకృష్ణ దశాబ్ద కాలం నుంచి నటుడిగా, రాజకీయ నాయకుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పటినుంచి ఆయన కుమారుడు బాలకృష్ణ టీడీపీ వెంటే నడిచారు. అయితే 2014 ముందు వరకు బాలకృష్ణ కేవలం ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనేవారు. కానీ 2014లో తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల పోరులో దిగారు.
అనంతపురం జిల్లాలోని టీడీపీ కంచుకోట హిందూపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికలకు పోటీ చేసి విజయం సాధించారు. 2019లో ఫ్యాను గాలి గట్టిగా వీచినప్పటికీ హిందూపూర్ లో మాత్రం బాలయ్య టీడీపీ జెండానే ఎగురవేశారు. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలకృష్ణ కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా మరోసారి హిందూపూర్ లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజల ఆశీర్వాదంతో హిందూపూర్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు.
మరోవైపు నటుడిగా కూడా హ్యాట్రిక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నారు. అఖండ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలకృష్ణ ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ హ్యాట్రిక్ ఫీట్ సాధించటంతో బాలయ్య అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. డబుల్ హ్యాట్రిక్ బాలయ్యకు డబుల్ కిక్ ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు.