అయోధ్య లోని రామాలయ నిర్మాణం పూర్తై.. మరో పందొమ్మిది రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ.. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రామాలయ ప్రారంభ వేళ.. అయోద్యను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మోడీ సర్కారుకు స్థానిక ముస్లింలు స్పందిస్తున్న తీరుకు భిన్నంగా అసద్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. మొన్నటికి మొన్న అయోధ్య ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో సందర్భంగా బాబ్రీ మసీదు (వివాదాస్పద కట్టడం) కేసులో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైనా ఇక్బాల్ అన్సారీ.. పూల వర్షం కురిపించటం తెలిసిందే.
నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ముస్లింలను రెచ్చగొడుతున్న అసదుద్దీన్ ఓవైసీ…. అయోధ్యలోని వివాదాస్పద కట్టడంపై జరిగిన న్యాయపోరాటంలో ఏరోజు కూడా భాగస్వామి కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ముస్లింలను తన ప్రసంగాలతో రెచ్చగొట్టే ఈ లోక్ సభ సభ్యుడు.. అయోధ్య వివాదాస్పద కట్టడంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగినప్పుడు ఎందుకు పాలు పంచుకోలేదు? తన వాదనను ఎందుకు వినిపించలేదు? అప్పుడు అలా ఉండిపోయి.. ఈ రోజున దేశంలో మతాల మధ్య చీలిక తెచ్చేలా చేస్తున్న బరితెగింపును అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.
అయోధ్యలోని వివాదాస్పద కట్టడం ఒకప్పుడు మసీద్ అంటూ సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీ.. సుప్రీం తీర్పు నేపథ్యంలో నిర్మితమైన రామాలయాన్ని స్వాగతిస్తున్నప్పుడు.. అసద్ మాత్రం అందుకు భిన్నంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం చూస్తే.. రాజకీయ ప్రయోజనం కోసం దేశంలో అలజడికి కారణమవుతున్న ఆయన తీరును తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.