డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, ఆర్యన్ అరెస్టయిన వెంటనే అతడికి బెయిల్ కావాలంటూ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, సాంకేతిక కారణాలతో ఆ బెయిల్ పిటిషన్ ను మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో ఆర్యన్ కు చుక్కెదురైంది. ఇటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చే అధికారం మేజిస్ట్రేట్ కోర్టుకు లేనందున…ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ తర్వాత రెండు రోజుల పాటు ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. బెయిల్ పై ఆర్యన్ ఖాన్ బయటకు వెళితే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో, ఈ బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్యన్ ఖాన్ కు ఊరటనిస్తూ…బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆర్యన్ ఖాన్ తోపాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలకు బెయిల్ మంజూరైంది. ఆర్యన్ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి
వాదించారు. గెస్ట్ గా మాత్రమే ఆ పార్టీకి ఆర్యన్ వెళ్లాడని, అతడి వద్ద డ్రగ్స్ లేవని ఆయన వాదనలు వినిపించారు. తమ క్లయింట్లను ఇబ్బంది పెడుతున్నారని, నేరం రుజువైనా…ఏడాది శిక్ష పడే కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆర్యన్ ఖాన్ పక్కన ఉన్న వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికాయని, ఆర్యన్ ను అరెస్ట్ చేశారని వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఎట్టకేలకు ఈ కేసులో షారుక్, ఆర్యన్ ల కు ఊరట లభించినట్లయింది. కాగా, షారుక్ వంటి సెలబ్రిటీ కొడుకు హోదాలో ఉన్న ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో ఉండడం, బెయిల్ మంజూరులో జాప్యం జరగడంతో పలువురు ఈ కేసుకు రాజకీయ రంగు పులిమారు. అయితే, టెక్నికల్ రీజన్స్ తో నే బెయిల్ రాలేదని తాజాగా ప్రూవ్ అయింది.