మంగళగిరి నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చేశామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం మొత్తం పసుపుమయంగా మారిందని ఆయన చెప్పారు. మంగళగిరిలో వైసీపీ కనుమరుగైందని అన్నారు. మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు తన సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఇన్నాళ్లూ ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ, ఇపుడు టీడీపీ బలపడడంతో ఇళ్ల పట్టాలు ఇస్తామని హడావుడి చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల ముందు వైసీపీ చేస్తున్న హడావుడిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని అన్నారు. మరో 72 రోజుల తర్వాత ఏపీ మొత్తం పసుపుమయం కాబోతోందని జోస్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుంటానని లోకేష్ చెప్పారు. రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా నియోజకవర్గాన్ని మార్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి తాను ఓటమి పాలయ్యానని, అయినా సరే, నియోజకవర్గంలో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించానని గుర్తు చేశారు.