మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి ఆ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుపై ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో జగన్ సర్కార్, సంచయిత గజపతి రాజుపై అశోక గజపతిరాజు ఇప్పటికే పలుమార్లు పై చేయి సాధించారు.
కోర్టు కూడా అశోక్ గజపతి రాజునే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా నియమించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మాన్సాస్ ట్రస్టు చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు పునర్నియామకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సంచయిత గజపతి రాజు, ఏపీ సర్కార్…డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో, అశోక్ గజపతిరాజు, ఉద్యోగులపై పెట్టిన కేసుకు సంబంధించి తదనంతర చర్యలు తీసుకోవద్దని హైకోర్టు గతంలో ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు…ఏపీ ప్రభుత్వానికి, సంచయిత గజపతిరాజుకు షాకిచ్చింది. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం, సంచయిత గజపతి రాజు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును సీజే డివిజనల్ బెంచ్ సమర్థించింది.
జగన్ సర్కార్ వచ్చీరాగానే అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తొలగిస్తూ రాత్రికి రాత్రే రహస్య ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా నియమించింది. దీంతో, జగన్ ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, సంచయిత నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసి అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం, సంచయిత మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా..తాజాగా మరోసారి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.