ఏపీ హైకోర్టులో అమరావతిపై రోజు వారి విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబరు 5 నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. అంశాల వారీ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈరోజు కీలకమైన అమరావతి ఖర్చు అంశం తెరపైకి వచ్చింది. ఎంత ఖర్చు పెట్టారు. రాజధాని మార్చితే రాష్ట్రం ఎంత నష్టపోతుంది? అనేక సార్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… అమరావతి కట్టడానికి డబ్బుల్లేవు అన్నారు. మరి అమరావతి కట్టం అని తేల్చినట్టే కదా. అంటే రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్లో చెప్పింది చేసే అవకాశం లేదు అనే కదా. ఇది రెండు విధాలుగా తప్పు అని రైతులు పిటిషన్లు వేశారు.
ఒకవైపు రాజధానికి డబ్బుల్లేవు అంటూ ఒక రాజధానికి డబ్బుల్లేని వారు 3 రాజధానులు ఎలా కడతారు? అన్నది ఒక ప్రాథమిక ప్రశ్న అయితే, మా పరిస్తితి ఏంటి అని అడిగినపుడు మాత్రం మిగతా వాటితో పాటు అమరావతి కూడ ా రాజధానిగా ఉంటుందన్న ప్రభుత్వం చెప్పడంలో ఔచిత్యమే లేదంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ప్రకటనలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నపుడు సీఆర్డీఏతో అగ్రిమెంట్లు చేసుకున్న మేము (రైతులు) తీవ్రంగా నష్టపోతాం అన్నది వారి వాదన.
గత టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్దికి, నిర్మాణాలకు రూ.9,600 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్ష్యాలతో సహా చెప్పారు. మరో రూ.46,000 కోట్ల పనులు చేయడానికి టెండర్లు కూడా ఫైనల్ చేశారు. కొన్ని కంపెనీలు పనులు కూడా ప్రారంభించాయి.
అయితే, వైసీపీ నేతలు, మంత్రులు అంతెక్కడ ఖర్చుపెట్టారు అంటూ చంద్రబాబు మాటలు తప్పుపడుతూ వస్తున్నారు. కానీ ఇపుడు వాటిని అధికారికంగా ప్రభుత్వమే వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హైకోర్టు అమరావతిపై పెట్టిన ఖర్చు వివరాలు మొత్తం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది.