రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగంలో గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ధ్వం సం చేసిందని పేర్కొన్నారు.(వాస్తవానికి గతంలో ఉన్నది కూడా .. గవర్నర్ పేరుతో నడిచిన ప్రభుత్వమే) రుషి కొండను తొలిచేసి.. అక్కడ విలాస వంతమైన భవనాలను కట్టారని.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని చెప్పారు. దీనివల్ల అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింన్నారు.
నాసిరకం మద్యాన్ని ప్రజలకు అంటగట్టారని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం గత ప్రభుత్వానికి లేదని, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో సొమ్ములు రాబట్టారని.. అయిన దానికీ కానిదానికీ పన్నుల రూపంలో ప్రజలను పీడించారని చెప్పారు. మద్యం విధానంలో చోటు చేసుకున్న భయంకరమైన దోపిడీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను దోచుకునేందుకు ప్రయత్నించారని గవర్నర్ తెలిపారు.
ఇప్పుడు తమ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడం ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా ముందుకు సాగుతుందని గవర్నర్ నజీర్ తెలిపారు. గత ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు చోటు చేసుకున్నాయన్న గవర్నర్.. అందరిపైనా అనవసరంగా కేసులు పెట్టారని.. కొందరిని జైలుకు కూడా పంపించారని తెలిపారు. తద్వారా పెట్టుబడులు రాకుండా ఆగిపోయాయన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలు కు పంపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేసిందని విమర్శించారు.
సుపరిపాలన అందించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గవర్నర్ తెలిపారు. ప్రజలను అన్ని విధాలా వేధించి.. కక్షపూరిత రాజకీయాలతో పనిచేసిందన్నారు. నాడు-నేడు పథకంలో ప్రజల సొమ్ము ను హరించారని తెలిపారు. హత్యా రాజకీయాలు చోటు చేసుకున్నాయని తన ప్రసంగంలో పేర్కొన్నారు. అందుకే ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం.. వారి అభివృద్ధి లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.