మరో సంచలన ఆరోపణల్ని సంధించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. తాజాగా ఏపీ రాష్ట్ర సీఎస్ కు ఆయనో లేఖ రాశారు. ఇది కాస్తా సంచలనమైంది. అందులో ఏపీ డీజీపీపై తీవ్ర ఆరోపణలు చేయటమే కాదు.. తనను మోసం.. ఫోర్జరీ కేసులో ఇరికింయే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తనను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేసిన వారిపై విచారణ జరపాలని.. సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన కోరుతున్నారు.
తనను అక్రమంగా ఇరికించే ప్రయత్నంలో డీజీపీ.. సీఐడీ అదనపు డీజీ.. ఏసీబీ డీజీ.. నిఘా విభాగంలో మరికొందరు అధికారులు కూడా ఈ నేరంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. పలువురు అధికారులు.. ప్రస్తుతం వారు విధులు నిర్వహిస్తున్న చోట్ల కొనసాగిస్తే.. తనపై ఉన్న కేసు సక్రమంగా జరిగే అవకాశం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ కు లేఖ రాసిన ఏబీ వెంకటేశ్వరరావు పలు అంశాల్ని ప్రస్తావించారు. అవేమంటే..
– నన్ను సస్పెండ్ చేస్తూ అక్రమ ఉత్తర్వులు జారీ చేసిన ప్రవీణ ప్రకాశ్.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిలపై చర్యలు తీసుకోవాలి.
– ఈ ఇద్దరు ప్రభుత్వాన్ని పక్క దారి పట్టించారు. తప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలి.
– అంతర్వేది రథం దహనం కేసును సీబీఐకు అప్పజెప్పిన తరహాలో నాపై ఉన్న కేసును బదిలీ చేయండి
– నాపై విచారణకు ఆదేశిస్తూ డీజీపీ..సీఐడీ అదనపు డీజీకి మెమో జారీ చేశారు. అందులో 05-02-2020 ఉన్న తేదీని 02-02-2020గా ఎందుకు మార్చారు? తేదీని మార్చింది డీజేపీయే. అలా ఎందుకు చేశారు?
– ఇది కచ్ఛితంగా ఫోర్జరీ కిందకే వస్తుంది. ఆయన ఐపీసీ 468 సెక్షన్ ప్రకారం శిక్షార్హులు.
– ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ ప్రకారం డీఎస్పీ ఆరో తేదీ నాటికి విచారణ నివేదికను ఎలా సిద్ధం చేశారు?