గత రెండు రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు సైతం వర్షం నీటితో చెరువుల్లా మారాయి. ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కేవలం ఒక్కరోజే 29 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ నీట మునిగింది.
రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సహాయక బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎక్కడ చూసినా నీరు ఏరులై పారడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి.. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్నయం తీసుకున్నారు. భారీ వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలంటూ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోగా.. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవబోతోంది. అలాగే సహాయచర్యలకు ఒక్కో జిల్లాకు రూ.3 కోట్లు, తీవ్రత తక్కువ ఉంటే రూ.2 కోట్లు చొప్పున అత్యవసర సాయాన్ని విడుదల చేశారు. అంతేకాకుండా భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.