మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈసారి క్షమిస్తున్నా అంటూ ఏపీ అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష హోదా కోసం జగన్ పట్టు పడుతుండడం పై అయ్యన్నపాత్రుడు రియాక్ట్ అయ్యారు. జగన్ కోరిక తీర్చడం కుదరదని స్పీకర్ తేల్చేశారు. 2024 జూన్ 21న సంప్రదాయాలకు అనుగుణంగానే శాసనసభ జరిగిందని.. జూన్ 24న ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ తనకు లేక రాశారని ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారు.
ఆ లేఖలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయని సభకు వివరించారు. ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించగలిగే అధికారం స్పీకర్ కు మాత్రమే ఉంటుందన్న వాదన సరికాదని జగన్ కు హితవు పలికారు. ప్రతిపక్ష హోదా కోసం ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ విచారణకు అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. ఈలోపై హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించినట్టు వైసీపీ తప్పున ప్రచారం చేస్తుందని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
ఏపీ వేతనాలు ఫించన్ చెల్లింపు అనర్హత చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉందని స్పీకర్ తెలిపారు. సెక్షన్ 12బి ప్రకారం.. ప్రతిపక్ష హోదా దక్కాలంటే ప్రభుత్వ వ్యతిరేఖ రాజకీయ నాయకుడిగా సభలో ఉండాలని.. ప్రతపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలని చెప్పారు. సభ్యులలో పదింట ఒక వంతు సభ్యులు ఉండాలని.. పార్లమెంట్‌తో పాటు అన్ని శాసనసభలలో దీని పాటిస్తున్నారని అయ్యన్నపాత్రుడు వివరించారు.
2019న ఇదే సభలో జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబుకు 23 మంది సభ్యలు ఉన్నారని.. ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్షహోదా స్టేటస్ కూడా ఉండదేమో అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షనాయకుడిగా గుర్తింపు పొందాలంటే 10 శాతం సంఖ్యాబలం ఉండాలని నాడు పరోక్షంగా స్పష్టం చెప్పిన జగన్.. నేడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కోపం పాకులాడటం తగదన్నారు. ప్రజలు ఎన్నుకున్న దేవాలయం ఈ సభ అని.. ఈ దేవాలయానికి తాను పూజారిని మాత్రమే అన్నారు. దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం కరెక్ట్ కాదని జగన్ కు స్పీకర్ చురకలు వేశారు.
ఇక స్పీకర్‌కు దురద్దేశాలు ఆపాదించడం రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారం సభా ఉల్లంఘన కిందకు వస్తుందని.. జగన్ ఇప్పటి వరకు సాగించిన దుష్ప్రచారాన్ని సభాపతి హోదాలో ఈసారికి క్షమిస్తున్ననట్లు అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఇదే కొనసాగితే నిర్ణయాన్ని సభ్యులకు వదిలి పెడతానని తెలిపారు. అలాగే సభకు దూరంగా ఉంటున్న వైసీపీ సభ్యులకు తమ నియోజకవర్గాల ప్రజలు ఇచ్చిన బాధ్యతను గుర్తించి ప్రజల గొంతు వినిపించడానికి సభకు రావాలని స్పీకర్ సూచించారు. ప్రతిపక్ష హోదా మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.