‘ప్రసన్న కుమార్ సూర్యదేవర’ ఆంధ్ర ప్రదేశ్ శాసన వ్యవస్థకు సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఆయన ఈవేళ సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.
‘ప్రసన్న కుమార్’ భారత ప్రభుత్వంలో విభిన్న హోదాల్లో రమారమి 30 ఏళ్ళ పాటు విశిష్ట సేవలందించారు. అందులో 15 ఏళ్ళకు పైగా అత్యున్నత రాజ్యాంగ కార్యాలయాలలో పని చేశారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు మూడింటి పనితీరుపై అవగాహనగల ‘ప్రసన్న కుమార్ సూర్యదేవర’ ను శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సెక్రటరీ జనరల్ పదవికి ఎంపిక చేశారు. శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు, శాసన వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పీకర్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. తదనంతరం ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఈ నియామకాన్ని ధృవీకరించారు.
‘ప్రసన్న కుమార్ సూర్యదేవ’ గతంలో ఐదేళ్లపాటు లోకసభ స్పీకర్‌కు ఓఎస్డ్ గా పనిచేశారు. చట్ట సభల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలన్న అప్పటి లోక్ సభ స్పీకర్ లక్ష్యానికి అనుగుణంగా, పార్లమెంటులో జరిగింది జరిగినట్టుగా ప్రజలకు వెన్వెంటనే తెలియజేసేందుకు మీడియాతో సన్నిహిత సమన్వయం చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా పార్లమెంటు ద్వారా, పార్లమెంటు కోసం ‘లోక్‌సభ టీవీ’ పేరుతో స్పీకర్ నేతృత్వంలో టీవీ ఛానెల్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. తదనంతరం భారత ఉప రాష్ట్రపతి / రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ మరియు డైరెక్టర్‌గా ఆరేళ్లకు పైగా పనిచేశారు. ఆయన ‘రాజ్యసభ టీవీ’ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
‘ప్రసన్న కుమార్’ దాదాపు మూడు సంవత్సరాలు ఢిల్లీ శాసన సభ కు కార్యదర్శిగా పనిచేశారు. విభాగాధిపతిగా శాసన సభ సచివాలయంలో పనితీరు మెరుగు పరచారు. ఇంకా శాసనసభ విధి విధానాల్లో పారదర్శకతను పెంచే సంస్కరణలను ప్రవేశపెట్టారు. ప్రసన్న కుమార్ భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం లో ఓఎస్టీ గా, భారత సుప్రీం కోర్టులో రిజిస్ట్రార్‌గా కూడా కొంతకాలం పనిచేశారు. ఆరంభంలో ఢిల్లీలో ఆకాశవాణి వార్తా విభాగంలో తెలుగులో న్యూస్ కాస్టర్ గా, విభాగాధిపతిగా పనిచేశారు. కొంతకాలం వార్తా విభాగంలో పరిపాలనా బాధ్యతలను కూడా నిర్వర్తించారు.
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సైన్స్‌లో పట్టా పొందిన ‘ప్రసన్న కుమార్ సూర్యదేవర’, తదనంతరం న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ శాస్త్రంలో ఎమ్మెస్సీ, ఎం.ఫిల్. డిగ్రీలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు.