ఏదో చేయబోతే మరేదో అవుతుందన్నట్లుగా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు అలాంటిదే చోటు చేసుకుంది. కొన్ని సందర్భాల్లో సమాధానాలు చెప్పే కన్నా మౌనంగా ఉండటానికి మించింది లేదంటారు. ఆ లాజిక్ ను మిస్ అయినట్లున్నారు నటి హేమ. సంచలనంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన టాలీవుడ్ సీనియర్ నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు. బెంగళూరు శివారులో నిర్వహించిన ఈ హైప్రొఫైల్ రేవ్ పార్టీ కి సంబంధించిన సంగతులు సంచలనంగా మారాయి.
ఈ పార్టీలో మొత్తం 101 మంది పాల్గొనగా అందులో 30 మంది యువతులు.. 71 మంది పురుషులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగం జరిగినట్లుగా వస్తున్న వార్తలు ఒకవైపు.. మరోవైపు బెంగళూరు పోలీసుల ఆధ్వర్యంలో పార్టీకి హాజరైన వారందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరిస్తున్నారు.
ఈ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం. వీరిలో రాజకీయ.. సినీ రంగానికి చెందిన వారున్నట్లుగా చెబుతున్నారు. సినీ నటి హేమ కూడా ఈ పార్టీకి హాజరైనట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. తాను రేవ్ పార్టీలో లేనని.. హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా ఒక వీడియోను విడుదల చేసిన ఆమె.. కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకున్నారు.
ఆమె వీడియో విడుదలైన కాసేపటికి బెంగళూరు పోలీసులు.. ఆమెకు సంబంధించిన ఫోటోల్ని విడుదల చేశారు. అంతేకాదు.. హేమ ప్రజలను తప్పుదోవ పట్టించినట్లుగా పేర్కొన్నారు. ఇలా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అదనంగా ఆమెపై మరో కేసును కూడా నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఈ పార్టీని నిర్వహించిన వాసుతో పాటు మరో నలుగురు అరెస్టు అయినట్లుగా చెబుతున్నారు.
నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. బెంగళూరులోనే ఉంటూ.. తాను హైదరాబాద్ లో ఉన్నట్లుగా పేర్కొంటూ చేసిన వీడియో ఆమెకు కొత్త తలనొప్పులు.. మరో అదనపు కేసును తెచ్చి పెట్టుకున్నట్లైంది. హడావుడిగా క్లారిటీ ఇచ్చే బదులు.. కామ్ గా ఉండిపోతే బాగుండేది కదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇక.. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ పేరు కూడా వినిపించింది. ఇదే విషయాన్ని కొన్ని యూట్యూబ్ చానళ్లు పెద్ద ఎత్తున వార్తల్ని ప్రసారం చేశాయి. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదంటూ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా శ్రీకాంత్ మీద యూట్యూబ్ చానళ్లలో వార్తలు వచ్చిన కాసేపటికి.. తాము తొందరపాటుతో ఆయన గురించి వార్తలు ప్రసారం చేశామని.. తమ వల్ల తప్పు జరిగిందని.. శ్రీకాంత్ పార్టీలో లేరన్న విషయాన్ని పేర్కొంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో.. తమ అత్యుత్సాహానికి చింతిస్తున్నట్లు పేర్కొంటూ.. బహిరంగ క్షమాపణలు చెప్పటం గమనార్హం.