టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్నికలకుముందు ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఆగస్టు 15ను పురస్కరించుకుని గురువారం ప్రారంభించారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడలో అధికారికంగా అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొన్నా రు. దంపతులు ఇరువురు కలిసి రిబ్బన్ కట్ చేసి గుడివాడ పార్క్రోడ్డులో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను ప్రారంభించారు. తొలుత క్యాంటీన్లో కలియ దిరిగి ఏర్పాట్లను పరిశీలించారు.
భోజన పాత్రలు, తాగునీరు, మురికినీరు పోయే ఏర్పాట్లును కూడా చంద్రబాబు దంపతులు పరిశీలించారు. అనంతరం.. స్వయంగా రుసుము చెల్లించి(రూ.10) టికెట్లు తీసుకున్నారు. అయితే.. తొలుత అన్న క్యాంటీన్లకు వచ్చిన పలువురు ఆటో కార్మికులు, ఇతర చిరు వ్యాపారులకు చంద్రబాబు దంపతులు ఆహార పదార్థాలను వడ్డించారు. భువనేశ్వరి అన్నం వడ్డించగా.. చంద్రబాబు సాంబారు వడ్డించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.. కూర వడ్డించారు. ఇలా.. 10 మంది వరకు వచ్చిన వారిని అన్నంవడ్డించారు.
అనంతరం.. చంద్రబాబు దంపతులు కూడా రూ.5 భోజనాన్నిరుచి చూశారు. క్యాంటీన్‌కు వచ్చిన వారితో కలివిడిగా మాట్లాడుతూ.. ఇరువురూ భోజనం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కాగా తొలి రోజు భోజనంలోస్వీట్ను ప్రత్యేకంగా వడ్డించారు. దీనిని కొనసాగించాలని చంద్రబాబు సూచించారు. ఏదొ ఒక స్వీటును అందించాలని చెప్పారు. అనంతరం.. నిర్వాహకులను అభినందించారు. నారా భువనేశ్వరి సైతం అన్న క్యాంటీన్ భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీరుతుందని.. ఆమె వ్యాఖ్యానించారు.