ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండిస్ట్రీలో టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనిరుధ్ రవిచందరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు దర్శక నిర్మాతలకు ఏఆర్ రెహమాన్ కోసం నెలలు తరబడి ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తమిళ సినిమాల ద్వారా చాలా తక్కువ టైమ్ లో అనిరుధ్ భారీ స్టార్డమ్ అందుకున్నాడు. తన మ్యూజిక్ తో ఫ్లాప్ అయ్యే సినిమాను కూడా హిట్ చేయగల సమర్థుడు. అదే అతనికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది.
ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ చిత్రాలకు కూడా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఇండియా వైడ్ గా అత్యధిక పారితోషికం అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా చలామణి అవుతున్నాడు. ఇటీవల కాలంలో జైలర్, జవాన్, విక్రమ్ వంటి పలు హిట్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోశాడు. అలాగే రీసెంట్ గా విడుదలైన దేవర మూవీకి కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా.. మిక్స్డ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది.
ఇక దేవర సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్ లో ఎన్టీఆర్ నటన మొదటి స్థానంలో ఉంటే.. అనిరుధ్ అందించిన సంగీతం రెండో స్థానాన్ని దక్కించుకుంది. తన మ్యూజిక్ తో సినిమాను అనిరుధ్ నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. అయితే దేవరకు అనిరుధ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలం నుంచి ఒక్కో సినిమాకు రూ. 8 నుంచి 10 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్న అనిరుధ్.. దేవర కోసం ఏకంగా రూ. 12 కోట్లు ఛార్జ్ చేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రెమ్యునరేషన్ లో అనిరుధ్ సౌత్ ఇండిస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలను మించిపోయాడనే చెప్పాలి.