ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా పొరుగురాష్ట్రాలకు తరలిపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఏపీలో ఉన్న కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పెట్టెబేడె సర్దుకొని వెళ్లిపోతుంటే….మరోవైపు వైసీపీ నేతలు మాత్రం పాలనా రాజధాని విశాఖ కొత్త కంపెనీలతో విరాజిల్లుతోందంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కొత్త కంపెనీల మాట దేవుడెరుగు…కనీసం ఆల్రెడీ ఉన్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోకుండా కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యత.
కానీ, ఆ కనీస బాధ్యతను నెరవేర్చడంలోనూ జగన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు, టీడీపీ నేతల వ్యాపారాలు దెబ్బకొట్టి వారిపై కక్ష సాధించడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్న వైనంపైనా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ ను జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వచ్చాయి. ఆ రకంగానూ ఏపీలోని పలు సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లేందుకు జగనే కారణమవుతున్నారు.
జగన్ చర్యల వల్ల నష్టపోతోంది…టీడీపీ కాదు…ఏపీ ప్రజలు అన్న విషయం తెలుసుకునేసరికి ఎన్నో కంపెనీలు పొరుగురాష్ట్రాల బాటపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా అమరరాజా బ్యాటరీస్ సంస్థ చిత్తూరులో విస్తరించాలనుకున్న ‘అడ్వాన్స్ డ్ లిథియం టెక్నాలజీ రీసెర్చ్ హబ్’ తమిళనాడుకు తరలిపోవడం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ తరలింపు తర్వాత చిత్తూరులోని ప్రధాన సంస్థను కూడా తమిళనాడుకు తరలించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
‘అడ్వాన్స్ డ్ లిథియం టెక్నాలజీ రీసెర్చ్ హబ్’ తరలింపు దాదాపుగా ఖాయమైందని, ఈ ప్రకారం తమిళనాడు సీఎం స్టాలిన్ తో అమరరాజా యాజమాన్యం చర్చలు జరిపిందని, అమరరాజా సంస్థకు స్టాలిన్ రెడ్ కార్పెట్ పరచారని తెలుస్తోంది. అమరరాజా సంస్థ ఏర్పాటుకు ఇప్పటికే స్ధలం కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో తమకు ఎదురువుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇక, ఆ స్ధలంలో ముమ్మరంగా సంస్థ నిర్మాణ పనులు సాగుతున్నాయని, 3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకు ఆ సంస్థ తరలివెళ్ళబోతోందని ప్రచారం జరుగుతోంది. బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్ధ అయిఉండి, 1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ అమరరాజా..ఏపీ నుంచి తమిళనాడుకు తరళివెళితే అది కచ్చితంగా జగన్ అసమర్థ పాలన వల్లే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
పన్నుల రూపంలో ఏటా ఏపీకి రూ.1200 కోట్లు చెల్లిస్తున్న అమరారాజా కంపెనీని పోగొట్టుకోవడం లోటు బడ్జెట్ తో కొట్టుమిట్టాడుతూ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఏపీ సర్కార్ కు తీరని లోటే. దీంతోపాటు, వేలాదిమంది ఏపీవాసులు ఉపాధి కోల్పోవడం కూడా వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడలో ఎటువంటి సందేహం లేదు.