ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ల కాంబోలో వచ్చిన ”పుష్ప:ది రైజ్” సినిమా దేశవ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ”పుష్ప”…అటు బాలీవుడ్ లోనూ వంద కోట్లు కొల్లగొట్టి ఇది డబ్బింగ్ సినిమానా అన్న అనుమానం వచ్చేలా చేసింది. ఇక, పుష్పలో తగ్గేదేలే అన్న డైలాగ్, మేనరిజం…శ్రీవల్లి పాటలో బన్నీ వేసిన స్టెప్పు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెటర్లు మొదలు పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు, సినీ తారలు, పొలిటిషియన్లు పుష్ప మేనియాకు ఫిదా అయ్యారు.
గతంలో, పుష్ప ఫివర్ కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ నూ తాకింది. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీని పుష్పతో పోల్చారు రాజ్ నాథ్. ఎన్నికల ప్రచారంలో పుష్కర్ తగ్గేదేలే అని పుష్కర్ అంటే ఫ్లవర్ తో పాటు ఫైర్ కూడా అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి పంచ్ డైలాగ్ చెప్పారు రాజ్ నాథ్.
ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ను ఓ ప్రతిష్టాత్మకు పురస్కారం వరించింది. ‘జీక్యూ లీడింగ్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్- 2022’ను బన్నీ సొంతం చేసుకున్నాడు. జీక్యూ మ్యాగజైన్ ప్రతి ఏడాది అందించే ఈ విశిష్ట పురస్కారం ఈ ఏడాది అల్లు అర్జున్ కు దక్కింది. మెన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీలో బన్నీ అగ్రస్థానంతో దుమ్మురేపాడు. గతంలో, ఈ అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. హైదరాబాదులో నిర్వహించిన ఓ ఈవెంట్ లో బన్నీ ఈ అవార్డును అందుకున్నాడు.
ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు జీక్యూ ఇండియా సంస్థకు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపాడు. జీక్యూ మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫొటో ఉండడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. ఈ అవార్డు అందించేందుకు జీక్యూ టీమ్ హైదరాబాదుకే తరలిరావడం విశేషం.