తన చిత్రాలతో ఓ తరం యువతను ఒక ఊపు ఊపిన తార షకీలా. 90ల మధ్యలో మొదలుపెట్టి ఓ పదేళ్ల పాటు మలయాళ సాఫ్ట్ పోర్న్ చిత్రాల్లో ఆమె ఊపు మామూలుగా సాగలేదు. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలు ఆమె చిత్రాలకు దక్కుతున్న ఆదరణ చూసి వాటిని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారంటే అప్పట్లో షకీలా జోరెలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఒక దశ దాటాక షకీలాకు క్రేజ్ పడిపోయింది. అరచేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసి ప్రపంచ పోర్న్ అంతా తేలిగ్గా అందుబాటులోకి రావడంతో మలయాళం సాఫ్ట్ పోర్న్ సినిమాలు ఆదరణా కోల్పోయాయి.
కొన్నేళ్లు ఏవో కొన్ని వ్యాంప్ పాత్రలు చేసి, ఆ తర్వాత దాదాపుగా సినీ రంగానికి దూరం అయిపోయింది షకీలా. అప్పుడప్పుడూ సంచలన ఇంటర్వ్యూలతో ఆమె వార్తల్లో నిలుస్తుంటుందంతే. ఈ మధ్య ఆమె మీద వచ్చిన ‘షకీలా’ సినిమా ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. కట్ చేస్తే ఇప్పుడు షకీలా ఒక ఆసక్తికర సమాచారంతో వార్తల్లోకి వచ్చింది. ఓటీటీల విప్లవం నడుస్తున్న ఈ టైంలో షకీలా సొంతంగా ఓటీటీ మొదలుపెడుతుండటం విశేషం. షకీలా సొంత ఓటీటీ అనగానే ఆమె చేసిన సాఫ్ట్ పోర్న్ సినిమాలన్నింటినీ అందులో పెట్టేస్తుందా అనిపించొచ్చు.
ఐతే ఆ సినిమాల్లో ఆమె నటి మాత్రమే. నిర్మాత కాదు. పైగా ఆ సినిమాల్లో కుర్రాళ్లను ఆకర్షించే దృశ్యాలన్నీ పోర్న్ వెబ్ సైట్లలో దొరుకుతాయి. షకీలా ఓటీటీలో రెగ్యులర్ చిత్రాలే రిలీజవుతాయట. అవి షకీలా నిర్మించే సినిమాలట. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇందులో లీడ్ రోల్ చేస్తున్నది షకీలా కూతురే కావడం విశేషం. పెళ్లి చేసుకోని షకీలా.. ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ అమ్మాయినే కథానాయికగా పరిచయం చేస్తూ రెండు సినిమాలు తీస్తోంది. అందులో ఒకదాని పేరు ‘అట్టర్ ఫ్లాప్ మూవీ’ అట. తన సినిమాలకు సెన్సార్ బోర్డు నుంచి ఇబ్బందులొస్తున్నాయని.. అందుకే సొంత ఓటీటీ పెట్టి అందులోనే తను నిర్మించే సినిమాలను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని షకీలా తెలిపింది.