వైసీపీ హయాంలో అమరావతిని మాజీ సీఎం జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి కోసం వేల ఎకరాలు ఇచ్చిన రైతులు సంవత్సరాల తరబడి ఆందోళన చేసినా జగన్ మనసు కరగలేదు. అయితే, తాజాగా ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టడంతో అమరావతి రైతులతోపాటు ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి పునర్నిర్మాణానికి చంద్రబాబు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు అమరావతిలో శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని, రాజధానిలో వివిధ నిర్మాణాలను చంద్రబాబు ఈ రోజు పరిశీలించారు.
అమరావతి రాజధాని శిలాఫలకం, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల సైట్లు, రాజధాని ప్రాంతంలోని ఇతర నిర్మాణాల స్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు 1,631 రోజులపాటు ఆందోళనలు చేపట్టారని, అమరావతి ఉద్యమం ప్రపంచంలో ఒక చరిత్ర అని అన్నారు. ఒక రాజధాని కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులకే దక్కుతుందని చెప్పారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే రాజధాని అమరావతిని అతలాకుతలం చేశారని, పోలవరాన్ని కూడా నాశనం చేశారని మండిపడ్డారు..
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు నాటి కేంద్రం ముందుకు వచ్చిందని, కానీ, వైసీపీ ప్రభుత్వం ఈ రెండింటిని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే, ఈ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని ప్రజలు 11 సీట్లతో బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని, సీఎం అయ్యే అర్హత లేని వ్యక్తికి ఆ పదవి వస్తే ఏం జరుగుతుందో ఐదేళ్ల పాటు చూశారని అన్నారు.
అమరావతి, పోలవరం ఎవరి వ్యక్తిగత సంపద కాదని, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, అమరావతి సమాజానికి పనికి వచ్చే సంపదను సృష్టించే కేంద్రం అని చెప్పారు. కేంద్రం నిధులతో నిర్మించే పోలవరం పూర్తి చేసుకోగలిగితే రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయొచ్చన్నారు. ప్రజావేదిక కూల్చి అక్కడ్నించి జగన్ పాలన ప్రారంభించాడని, అందుకే తాను అక్కడకు వెళ్లానని చెప్పారు.
ఆనాడు శంకుస్థాపన చేసిన పవిత్ర మట్టి, పుణ్యక్షేత్రాల మహిమ, ఇక్కడుండే రైతులు తనను, రాష్ట్రాన్ని కాపాడారని అన్నారు. ఏ విధంగా ఉండాల్సిన రాజధాని ఎలా తయారైందో బాధ పడ్డారు. అమరావతితో మాకేం సంబంధం, పోలవరంతో మాకేంటి సంబంధం అనుకోవద్దని, APలో A అంటే అమరావతి అని, P అంటే పోలవరం అని ఏపీకి చంద్రబాబు సరికొత్త భాష్యం చెప్పారు.