ప్రధానితో భేటీ తర్వాత.. ఆ రాష్ట్ర సీఎంతో జగన్ కు నడిచిన ట్వీట్ వార్ ఏంది?
ప్రస్తుతం నడుస్తున్న కరోనా సెకండ్ వేవ్ వేళ.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే బదులు.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసికట్టుగా కరోనాను జయించాల్సిన అవసరం ఉందన్నది నిజం. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొద్ది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అనంతరం.. ఈ భేటీపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విమర్శనాత్మకంగా ట్వీట్ చేస్తే.. దాన్ని ఖండిస్తూ ఏపీ సీఎం రీట్వీట్ చేయటం.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
తాను.. తన రాష్ట్రం తప్పించి మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించే జగన్.. అందుకు భిన్నంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి ట్వీట్ ను ఎందుకు తప్పు పట్టారు? అన్న ప్రశ్నలోకి వెళ్లే ముందు.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
గురువారం ప్రధాని మోడీ తెలంగాణ.. ఏపీ.. ఒడిశా.. జార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు.. పుదుచ్చేరి.. జమ్ము..కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో ఫోన్ లో మాట్లాడారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. గౌరవనీయ ప్రధాని ఫోన్ చేశారు.. ఆయన మనసులోని మాట చెప్పే బదులు పనికొచ్చే మాటలు చెప్పి.. పనికి వచ్చే మాటలు వింటే బాగుండేది’ అంటూ ఘాటు ట్వీట్ హిందీలో చేశారు.
వాస్తవానికి ఇలాంటి ట్వీట్ కు నేతలో.. రాష్ట్రాల ముఖ్యమంత్రులో స్పందిస్తారు. అందుకు భిన్నంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యారు. ‘ప్రియమైన సోరెన్.. మీరంటే చాలా గౌరవం ఉంది. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఇలాంటి రాజకీయాలు చేయటం తగదు. అది మన జాతిని బలహీనపరుస్తుందని ఒక సోదరుడిగా విన్నవిస్తున్నా. మనం కోవిడ్ పై పోరాడుతున్నాం. ఇది ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే తరుణం కాదు. మహమ్మమారిపై చేస్తున్న యుద్ధంలో మనమంతా ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమిది’’ అని రీ ట్వీట్ చేశారు.
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా స్పందిస్తూ.. వైఎస్ లాంటి పెద్ద నాయకుడి కొడుకువై ఉండి.. సీబీఐ, ఈడీ దాడులకు భయపడి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీతో ఇలా లాలూచీ పడటం సరికాదు.. మీరు ఎదగాలి’ అంటూ విమర్శలు చేశారు. అయితే.. ఇప్పుడున్న సంక్షోభ సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న మాటను పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని రీతిల రియాక్టు అయిన సీఎం జగన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.