2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలుపు బావుటా ఎగురవేశారు. గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా విజయ దుందుభి మోగించారు.
ఆలపాటి రాజాపై వైసీపీ పరోక్షంగా బలపరిచిన కేఎస్ లక్ష్మణరావుపై రాజా ఘన విజయం సాధించారు. లక్ష్మణరావుపై రాజా 82,319 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు రాగా లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.
తన విజయంపై రాజా స్పందించారు. ఇది అపూర్వమైన విజయమని, కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలు ముందే డిసైడయ్యారని అన్నారు. పీడీఎఫ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లకన్నా తనకు ఎక్కువ మెజారిటీ వచ్చిందని, పీడీఎఫ్ కూడా ఇతర రాజకీయ పార్టీలా తయారైతే సమాజంలో గౌరవం తగ్గిపోతుందని చెప్పారు. పీడీఎఫ్ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తనకు ఓటు వేయడం గర్వంగా ఉందన్నారు. తాను నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తినని చెప్పారు.
2024 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు టికెట్ దక్కలేదు. పొత్తు ధర్మం ప్రకారం జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలి అసెంబ్లీ టికెట్ దక్కింది. ఈ క్రమంలోనే రాజాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు.
మరోవైపు, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు కూటమి మద్దతు తెలిపింది. ఇక, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఈయనకు కూడా కూటమి మద్దతుగా నిలిచింది.