మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ను కొద్దిరోజుల క్రితం ఏపీ సిఐడి అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. 80 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రామోజీరావును అధికారులు విచారణ చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో సిఐడి దూకుడు కాస్త తగ్గింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రామోజీరావును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా నడ్డాతోపాటు రామోజీరావును కలిశారు. మరికొద్ది నెలల్లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రామోజీరావుతో నడ్డా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మార్గదర్శి కేసులో రామోజీరావును సిఐడీ ప్రశ్నించిన అనంతరం కూడా బిజెపి అగ్రనేత రామాజీని కలవడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, రామోజీరావుపై నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మార్గదర్శకుడని, దూరదృష్టి గల వారని కొనియాడారు. సినిమా, మీడియా రంగానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నడ్డా చెప్పారు. కాగా, రామోజీరావుతో నడ్డా భేటీ…జగన్ కు చెక్ పెట్టేందుకే అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.