విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ విషయంలో ఏపీ సీఎం జగన్ వైఖరిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జగన్ తో సంప్రదించిన తర్వాతే కేంద్రం విశాఖ ఉక్కు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్ర్రైవేటీకరణ వంటి అంశాలను ప్రకటించిందని ప్రచారం జరుగుతోంది. అదీగాక గత ఏడాది పోస్కో ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారని విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
అదంతా వదిలేసి కేంద్రానికి జగన్ లేఖ రాయడం…తాజాగా ప్రధాని మోడీని కలవాలంటూ అపాయింట్ మెంట్ కోరడం వంటివి కంటితుడుపు చర్యలేనని, జగన్ ది మొసలి కన్నీరని రాజకీయ విశ్లేషకులు దుయ్యబడుతున్నారు.ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీలు, జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కుని కేంద్రం అమ్మేస్తోందని… జగన్ కొంటున్నాడని చెబుతున్నా….28 మంది వైసీపీ ఎంపీలు గంగిరెద్దుల్లా తలాడిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల హక్కులు కాపాడలేని వారు పార్లమెంటులో ఉన్నా దండగేనని లోకేష్ నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కుని తుక్కులా కొట్టేయడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేస్తామని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తామని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నాం, జగన్ రెడ్డి అంగీకారంతోనే విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ జరుగుతోందని కేంద్రం స్పష్టం చేసిందని లోకేష్ గుర్తు చేశారు. కానీ, విశాఖ ఉక్కు పరిరక్షణ అంటూ లేఖలతో జగన్ రెడ్డి పిరికి కాలక్షేపం, వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని, వాటిని ఆపాలని లోకేష్ దుయ్యబట్టారు.
కాగా, అమలాపురానికి చెందిన బైరిశెట్టి రేణుక అనే యువతి ధైర్యం తనను ఆకట్టుకుందని లోకేష్ తెలిపారు. ఒక అన్నగా రేణుకకు అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని రేణుక స్వయంగా వెల్లడించిన ఓ వీడియోను లోకేష్ ట్వీట్ చేశారు. ఓ వైసీపీ నేత కుమారుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. రేప్ కేసుగా నమోదు చేశారని, ఓ మంత్రి ఆ నేత కుమారుడికి అండగా ఉన్నారని కన్నీరు పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకే ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా పోటీచేస్తున్నానని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రేణుక ధైర్యానికి సలామ్ కొట్టిన లోకేష్….వైసీసీ రాక్షసులపై ఆమె పోరాటానికి ఓ అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదని, బుల్లెట్ లేని జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు. స్వయంగా మంత్రులే మృగాళ్లను కాపాడేందుకు రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజుల్లోనే బాధిత మహిళకు న్యాయం చేస్తామన్నారని, కానీ 21 నెలలు అయినా ఒక్క మహిళకూ న్యాయం జరగలేదని లోకేష్ విమర్శించారు. రేణుకను మోసం చేసినవాడిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.