అందితే జుట్టు…అందకపోతే కాళ్లు…దొరికితే దొంగ…దొరక్కపోతే దొర….ఇటువంటి సామెతలన్నీ ప్రస్తుతం వైసీపీ నేతల తీరుకు అతికినట్టు సరిపోతాయంటే అతిశయోక్తి కాదు. అసెంబ్లీలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును, ఆయన సతీమణిని వైసీపీ సభ్యులు వివాదాస్పద రీతిలో విమర్శలు చేయడం సంచలనం రేపింది. కానీ, అసలు తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని వైసీపీ నేతలంతా ముక్తకంఠంతో బుకాయించారు.
అంటేగింటే..చంద్రబాబును అంటాం అని, భువనేశ్వరని అనాల్సిన అవసరం లేదంటూ ఓ రేంజ్ లో డైలాగులు చెప్పారు. అయితే, అసెంబ్లీలో వైసీపీ సభ్యుల కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వంతో వారంతా ఖంగుతిన్నారు. దానికితోడు, ఆ కామెంట్లు వైసీపీకి భారీగా డ్యామేజీ చేశాయి. దీంతో, ఇక చేసేదేమీ లేక…చివరకు తమ తప్పును పరోక్షంగా అంగీకరించారు. ఈ ప్రకారం వైసీీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఆ ఘటనను తాను సమర్థించడం లేదని చెప్పిన బొత్స…ఆ వ్యాఖ్యలకు వత్తాసు పలకడం లేదని చెప్పడంతో తమ సభ్యుల వ్యాఖ్యలను బొత్స పరోక్షంగా అంగీకరించినట్లయింది. అయితే, ఆ రోజు సభలో తాను కూడా ఉన్నానని, మైక్ లో కాకుండా పక్కనుంచి చేసిన కామెంట్ ను పరిగణలోకి తీసుకోకూడదంటూ బొత్స కొత్త భాష్యం చెప్పారు. అలా కొందరు సభ్యులు చేసిన కామెంట్లకు తానుగానీ, స్పీకర్ గానీ బాధ్యులం కాబోమని, అందరినీ కట్టడం సరికాదని తేల్చేశారు బొత్స.
ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ హితవు పలికిన బొత్స…మహిళలకు ప్రాధాన్యతనివ్వడంతో జగన్అ వంటి నాయకుడు మరొకరు లేరంటూ కితాబివ్వడం కొసమెరుపు. ఏది ఏమైనా..చివరకు తమ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని బొత్స పరోక్షంగా అంగీకరించినట్లేనని నెటిజన్లు అంటున్నారు.