తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నాడు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. తెలుగు నేలకు చెందిన నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా స్థానిక పార్టీల సత్తా ఏమిటో చాటి చెప్పిన ఘనత అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్ దే. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీవోరుదే. ప్రాంతీయ పార్టీలు తలచుకుంటే జాతీయ పార్టీలను మట్టికరిపించగలవని నిరూపించిన పార్టీ టీడీపీ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలా, మార్చి 29, 1982న అన్నగారు స్థాపించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ ఏడాదికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ ముందు వరుసలో ఉందంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు రూపంలో బలమైన లీడర్…పార్టీ కోసం ప్రాణాలిచ్చే ధృఢమైన కేడర్…వెరసి టీడీపీని దుర్భేద్యం చేశాయి. తెలుగుజాతి కష్టాల్లో ఉన్నప్పుడు పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. తమ కోసం పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చిన అన్నగారికి అశేషాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అన్నగారు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్నగారిని స్మరించుకుంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు. నందమూరి తారక రామారావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు, తెలుగు జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతోనే తెలుగు వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.
తెలుగు జాతి ప్రయాణాన్ని…1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావానికి ముందు….ఆవిర్భావం తర్వాత అని చూడాలని చంద్రబాబు అన్నారు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని అన్నగారు చేపట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజల మధ్యకు వచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని, తెలుగు ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు నాంది పలికిన రోజు ఇదే అని అన్నారు.
తమ జీవితాల్లో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన… బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీగా టీడీపీ ఎప్పటికీ నిలిచిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిపెడితే… తాను వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచానని అన్నారు. ఆ తరువాత కాలంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలనలో సంస్కరణలు తీసుకొచ్చానని… ప్రజల వద్దకే పాలన వంటి కార్యక్రమాలతో పాలనలో జవాబుదారీ తనం తీసుకువచ్చాని తెలిపారు. పాలకులు అంటే సేవకులు అనే నినాదంతో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేశామని అన్నారు.