రాజకీయం అంటే రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగం…ఇది ఓ తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్. ప్రస్తుతం రాజకీయాలంటేనే బురద గుంట అని…తెలిసి తెలిసీ దానిలో అడుగుపెట్టడం ఎందుకన్నది చాలామంది భావన. అయితే, పొలిటిషియన్ గా పవర్ టేస్ట్ చేయాలన్నది మరి కొందరి ఆకాంక్ష…జీవితకాలపు కోరిక. ఈ క్రమంలోనే రాజకీయాలలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఒకప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే మంచి వ్యక్తి, సేవాగుణం ఉన్న వ్యక్తి…అని పేరుండాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థికి జనానికి సేవ చేసే గుణం ఉంటే చాలు…డబ్బు అక్కర లేదు అన్న రీతిలో పాత రోజుల్లో రాజకీయాలుండేవి. ఈ కోవలోనే తెలంగాణకు చెందిన గుమ్మడి నర్సయ్య..వంటి వారు పైసా ఖర్చు పెట్టకుండా…ఓ మధ్యతరగతి జీవితం గడుపుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కానీ, ఇపుడు ఆ పరిస్థితులు లేవు. జనం మారారో…లేదంటే జనాన్ని రాజకీయ నాయకులు మార్చారోగానీ…నోటు ఇస్తేనే ఓటు వేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 10-15 కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో,రాజకీయాల్లోకి వచ్చేవారు కనీసం బడా వ్యాపారస్తులు, లేదంటే కోటీశ్వరులైతే తప్ప…ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేరన్న భావన దాదాపు అన్ని పార్టీలలోనూ ఏర్పడింది.
అందుకే, క్రమక్రమంగా ఎమ్మెల్యే అభ్యర్థులలో చాలామంది కోటీశ్వరులుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరుగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 264 మంది కోటీశ్వరులు పోటీలో ఉన్నారని వెల్లడైంది. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలకు గాను 946 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 264 మంది (27.90 శాతం) మంది కోటీశ్వరులే కావడం విశేషం.
అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను బట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 268 కోట్ల ఆస్తులతో యునైటెడ్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కి చెందిన మనరంజన్ బ్రహ్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి రాహుల్ రాయ్ రూ.136 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏఐయూడీఎఫ్ అభ్యర్థి సిరాజుద్దీన్ అజ్మల్ రూ.111 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. టాప్లో ఉన్న ఈ ముగ్గురూ తమ ఆదాయ మార్గం వ్యాపారమేనని అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం.